2019 ఎన్నికల్లో అదృష్టం అడ్డం తిరిగి అత్యల్ప మెజారిటీతో ఓడిపోయిన దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే..అది బొండా ఉమానే. టీడీపీలో కీలక నేతగా ఎదిగిన బొండా ఉమా 2014 ఎన్నికల్లో విజయవాడ నగరంలో కీలకంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం నుంచి  టీడీపీ తరుపున బరిలోకి దాదాపు 27 వేలపైనే మెజారిటీతో గెలిచారు. ఇక పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో బాగానే అభివృద్ధి చేసుకున్నారు. అన్నీ వేళల అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించారు.

 

ఇలా కష్టపడి నియోజకవర్గంలో పని చేస్తున్న బొండా 2019 ఎన్నికల్లో సులువుగా గెలిచేస్తారని అంతా అనుకున్నారు. ప్రత్యర్ధి పార్టీ సైతం సెంట్రల్‌లో ఉమాని ఓడించడం కష్టమే అని భావించారు. అందుకు తగ్గట్టుగానే 2019 ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో రౌండ్ రౌండ్‌కు బొండా ఆధిక్యం ప్రదర్శించారు. కానీ చివరి రౌండ్లకు వచ్చేసరికి మెజారిటీ పడిపోతూ వచ్చింది. వైసీపీ నుంచి బరిలో ఉన్న మల్లాది విష్ణు పుంజుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆఖరికి బొండాకు అదిరిపోయే షాక్ తగులుతూ...మల్లాది కేవలం 25 ఓట్ల తేడాతో గెలిచేశారు.

 

స్వల్ప మెజారిటీనే రావడంతో మళ్ళీ రీ కౌంటింగ్ చేశారు. అయిన సరే ఫలితం మారలేదు. పాతిక ఓట్లు బొండా కొంపముంచేశాయి. అటు పార్టీ కూడా దారుణంగా ఓడిపోయింది. దీంతో బొండా సైలెంట్ అయిపోయారు. విదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లతారని ప్రచారం వచ్చేసింది. అటు బొండా కూడా ఈ ప్రచారంపై సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయన పార్టీ మారిపోవడం ఖాయం అనుకున్నారు.

 

ఇక విదేశాల నుంచి నగరానికి తిరిగొచ్చిన వెంటనే, చంద్రబాబు దూతగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బొండా ఇంటికెళ్లడం, మాట్లాడటం జరిగిపోయాయి. అక్కడ ఏమో తెలియదు గానీ, ఆ తర్వాత నుంచి బొండా పార్టీలో ఫుల్ యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలని ఎండగడుతున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్ర పేరిట నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.

 

ముఖ్యంగా పెన్షన్, రేషన్ కార్డుల ఇష్యూపై ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలు, పక్కనే ఉన్న రాజధాని అమరావతి తరలి వెళ్లిపోతుందని విషయాలపై ప్రజలకు అవగాహన పెంచుతున్నారు. దీంతో సెంట్రల్ ప్రజల్లో కూడా బాగా మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. ఎక్కువ శాతం వైసీపీ ప్రభుత్వంపై నెగిటివ్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశం బొండాకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే రాబోయే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలో టీడీపీకి ప్లస్ అవుతుంది. మొత్తానికైతే బొండా... తన ఓటమికి కారణమైన పాతిక ఓట్లని వెనక్కి తెచ్చేసుకున్నట్లే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: