ఈరోజు ఢిల్లీలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఢిల్లీలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం అదనపు బలగాలను మోహరించింది. ఢిల్లీలో పరిస్థితులను జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఢిల్లీలో తాజా పరిస్థితిని కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీకి అజిత్ దోవల్ వివరించనున్నారు. 
 
నిన్న అర్ధరాత్రి రంగంలోకి దిగిన అజిత్ దోవల్ సీలంపూర్, జాఫ్రాబాద్ ప్రాంతాలలో పర్యటించారు. పోలీసులకు ఆందోళనలను అణచివేయటానికి పూర్తి స్వేచ్ఛను కల్పించారు. ఢిల్లీలో ఇప్పటికే పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీలో అల్లర్ల పరిస్థితి ఎలా ఉంది...? అల్లర్లను పూర్తిగా అణచివేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే అంశం గురించి అజిత్ దోవల్ కేంద్ర మంత్రి వర్గానికి వివరించనున్నారు. 
 
ట్రబుల్ షూటర్ ఎంట్రీతో ఢిల్లీలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. రాజధాని పరిణామాలపై మధ్యాహ్నం ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. ఆర్మీని రంగంలోకి దించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పోలీసులు పరిస్థితులకు అదుపులోకి తీసుకొనిరాలేకపోతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. 
 
పోలీసులు ప్రజలను భజన్ పురా ఏరియాలో ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. పౌరసత్వ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలతో రెండు రోజులుగా గోకుల్ పురి, చాంద్ బాగ్, కరవాల్ నగర్, బబూర్ పూర్, మౌజ్ పూర్, జఫాబాద్ ప్రాంతాలలో తీవ్ర హింస చెలరేగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ ఘర్షణల్లో 150 మంది గాయపడగా గాయపడిన వారిలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉన్నారని సమాచారం. హింసాయుత ఘటనల నేపథ్యంలో నార్త్ ఢిల్లీలోని 86 సెంటర్స్ లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: