తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రంప్‌ను కలుస్తానని ఊహించి ఉండడు.. కాని నిన్న రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం, రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విందుకు వివిధ రాష్ట్రాల నుండి అతిథులుగా వచ్చిన ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులను రాష్ట్రపతి కోవింద్.. ట్రంప్‌కు పరిచయం చేయగా, ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు అతిథులతో ట్రంప్‌ దంపతులు కరచాలనం చేశారు. ఈ సమయంలో ట్రంప్‌తో కేసీఆర్ కాసేపు ముచ్చటించారు.

 

 

ఇకపోతే ఈ విందుకు సీఎం కేసీఆర్‌ సూటు బూటు వేసుకొని హాజరయ్యారు. కేసీఆర్‌ వెంట ఎంపీ కేశవరావు తదితరులు ఉన్నారు. ట్రంప్‌కు రాష్ట్రపతి ఇచ్చిన విందులో తొమ్మిది రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఈ విందులో పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు, త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొన్నారు. అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు కు మీ అతిథ్యం బేష్‌ అని కేసీఆర్‌ని అభినందించగా, కేసీఆర్‌ మాట్లాడుతూ.. జీఈఎస్‌ సదస్సుకు మీరు హాజరవుతారని భావించామని, కానీ ఇవాంక ట్రంప్‌ ఆ సదస్సుకు వచ్చి అందరినీ ఆకట్టుకుందని  తెలియచేసారు..

 

 

కేసీయార్ మాటలకు.. ఆ సదస్సులో తాను పాల్గొనాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని ట్రంప్‌ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాలను ఇద్దరు మాట్లాడుకున్నారట.. ఇక మొతేరా స్టేడియంలో తనకు లభించిన ఘన స్వాగతాన్ని ట్రంప్‌ స్మరించుకున్నారు. భారత ప్రజలపై తనకు అపారమైన గౌరవం ఉందని, భారత్‌, అమెరికా మధ్య సత్సంబంధాలు ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగాలని ట్రంప్‌ అన్నారు. ఇక ఈ విందు అనంతరం మంగళవారం రాత్రి 10.32 గంటలకు ట్రంప్‌ దంపతులు అమెరికాకు వెళ్లే సమయాన తాను భారత్‌లో గడిపిన రెండు రోజులను ఎప్పటికి మర్చిపోనని చెప్పారు. ఇక కొసమెరుపు ఏంటంటే, సీఎం కేసీఆర్‌.. ట్రంప్‌, మెలానియా దంపతులతో పాటు వారి కుమార్తె ఇవాంకకు  కానుకలు అందించారట. అందులో ట్రంప్‌కు పోచంపల్లి శాలువా, చార్మినార్‌ మెమెంటో అందించగా.. మెలానియా, ఇవాంకకు పోచంపల్లి, గద్వాల చీరలను బహూకరించినట్లు సమాచారం...

మరింత సమాచారం తెలుసుకోండి: