ఘనమైన లక్ష్యాలు... కఠిన పరిస్థితులు.. ఆర్థికంగా ఇబ్బందులు... పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. రివర్స్ టెండర్లలో పనులు దక్కించుకున్న మేఘా సంస్థ వేగంగా పనులు చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం ఎంత వరకు వచ్చింది?. నిర్దేశించుకున్న లక్ష్యానికి తగ్గట్లుగా ప్రాజెక్టు పూర్తవుతుందా?

 

ఆంధ్రప్రదేశ్‌లో కేవలం కృష్ణా జలాలతో సాగునీటి కష్టాలు తీరే పరిస్థితి లేదు. గతేడాది శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు 8 సార్లు ఎత్తినా కొన్ని ప్రాంతాలకు నీటి కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రం మొత్తం సాగునీరు అందాలంటే పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయాల్సిన పరిస్థితి. జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. పోలవరం పూర్తైతే... 6 జిల్లాలకు తాగు, సాగునీటి కష్టాలు పూర్తిగా దూరమైనట్లే. రివర్స్ టెండరింగ్ వ్యవహారంతో కొంత జాప్యం జరిగినా.. పనులు పూర్తి స్థాయిలో పట్టాలకెక్కించి 2021 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రాజెక్టు పనులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్ 28న మరోసారి పోలవరం వెళుతున్నారు.

 

పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 69 శాతం పనులు పూర్తి అయ్యాయి. హెడ్ వర్క్స్‌లో60 శాతం... కుడికాలువ పనుల్లో 92 శాతం, ఎడమ కాలువ పనుల్లో 70 శాతం మేర పనులు పూర్తి అయ్యాయి. అయితే భూ సేకరణ మాత్రం కేవలం 16 శాతమే జరిగింది. హెడ్‌వర్క్స్‌కు సంబంధించిన పనుల్ని మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నవంబర్ నుంచి మొదలు పెట్టింది. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌,  అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌ కోసం మొత్తం 1169 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చెయ్యాల్సి ఉంది. నవంబర్ నాటికి 989 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తి చేశారు.  38 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను నవంబర్ నాటికి 28 లక్షల కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. అంటే 72 శాతం కాంక్రీట్ పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేస్తేనే ప్రభుత్వం అనుకున్న సమాయానికి ప్రాజెక్టు పనులు కొలిక్కి వస్తాయి.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో69 శాతం పనులు  పూర్తి అయ్యాయని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నా.. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దీనికి తగ్గట్లుగానే మేఘా సంస్థ పనుల్లో స్పీడు పెంచింది. మేఘా సంస్థ పనులు మొదలు పెట్టిన నాటికి ప్రాజెక్ట్ పూర్తిగా నీటితో నిండిపోయి ఉంది. వరదల తర్వాత.. నిర్మాణ ప్రాంతంలో నిలిచిపోయిన నీరు, మట్టిని తొలగించడం, రోడ్లను పునరుద్దరించడం లాంటి పనుల్ని మేఘా సంస్థ శరవేగంగా చేసింది. నెల రోజుల్లోనే పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చి పనులను పట్టాలకెక్కించింది.

 

హెడ్‌వర్క్స్‌లో కీలకమైన స్పిల్ వేలో మొత్తం 51 బ్లాకులు పూర్తి చెయ్యాల్సి ఉంది. ఒక్కో బ్లాక్ ఎత్తు 52 మీట్లర్లు. ఒక బ్లాక్ లో ఒక మీటరు ఎత్తుకు కాంక్రీట్ వేసేందుకునాలుగు రోజుల సమయం పడుతుంది. రోజూ నాలుగు బ్లాకుల్లో సమాంతరంగా కాంక్రీట్ పనులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చెయ్యాల్సి ఉంది. మేఘా సంస్థ ఒక్క ఫిబ్రవరిలోనే 40 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి, ఏప్రిల్ లో కూడా 50 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగితే.. జూన్ నాటికి స్పిల్‌వే వర్క్‌ దాదాపు పూర్తైననట్లే. దీనికి తగ్గట్లుగానే పనులు జరుగుతున్నాయి. 

 

గతంలో నిర్మాణ సంస్థలు నేలపై కాంక్రీట్ పనులు చేసేవి. ఇవి అంత క్లిష్టమైనవి కాదు. కానీ బ్లాకుల్లో కాంక్రీట్ పనులు చేయాలంటే 52 మీటర్ల ఎత్తుకు కాంక్రీట్ ను తీసుకు వెళ్లాలి. దీని కోసం ప్రపంచలోనే అతి పెద్ద కాంక్రీట్ బూస్టర్స్ వాడుతున్నారు. ప్రపంచంలో ఈ తరహా బూస్టర్లు మూడు ఉంటే.... రెండు పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో 3 వేల మంది కార్మికులు, ఉద్యొగులు పని చేస్తున్నారు. రాక్ ఫిల్ డ్యాం పనుల కోసం నదిలో ఇసుక గట్టిదనం తెలుసుకునే పరీక్షలు జరుగుతున్నాయి. ప్రధాన డ్యాం కోసం నేలను చదును చేసే పనులు కూడా మొదలు పెట్టారు. ఈ సీజన్ లో సగానిపైగా గేట్లు బిగించేందుకు నిర్మాణ సంస్థ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: