ఢిల్లీ అల్లర్లకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి మరింత ఆజ్యం పోస్తున్నట్లే ఉంది. తాజా  అల్లర్లపై కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యుసి సమావేశం నిర్వహించింది . తర్వాత సోనియా మాట్లాడుతూ అల్లర్లకు బిజెపినే కారణమంటూ మండిపడ్డారు. కమలంపార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల వల్లే జనాలు ప్రభుత్వంపై తిరగబడుతున్నట్లు వ్యాఖ్యానించారు. కాబట్టి కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయటమే అభ్యంతరకరంగా ఉంది.

 

మూడు రోజుల క్రితం మొదలైన అల్లర్లకు ఎవరు కారణమని కాదు ఆలోచించాల్సింది. అల్లర్లను ఎలా నియంత్రించాలని, మిగిలిన ప్రాంతాలకు పాకకుండా ఎలా ఆపాలా ? అని మాత్రమే ముందు ఆలోచించాలి. హఠాత్తుగా మొదలయ్యే గొడవలను పెద్ద కష్టం లేకుండానే ప్రభుత్వం ఆపగలుగుతుంది. కానీ ఓ ప్లాన్ ప్రకారం చేస్తున్న గొడవలు అంత తొందరగా చల్లారవన్న విషయం సోనియాకు తెలీంది కాదు. అందులోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వస్తున్న నేపధ్యంలోనే అల్లర్లు మొదలయ్యాయంటే ఇది కచ్చితంగా ప్లాన్ ప్రకారం జరిగిందని గ్రహించాలి.

 

సోనియా డిమాండ్ చేసినట్లు అమిత్ షా రాజీనామాతో అల్లర్లు ఆగిపోతాయా ? ఆగవు గాక ఆగవు. ఎందుకంటే అల్లర్ల వెనుక పాకిస్ధాన్ హస్తముందని యావత్ దేశానికంతా తెలుసు. పైగా అల్లర్ల వెనుక ఐఎస్ఐ హస్తం ఉందన్న విషయంలో నిఘా సంస్ధలకు ఆధారాలు కూడా దొరికాయని అంటున్నారు. కాబట్టి బాధ్యతాయుత ప్రతిపక్షంగా అమిత్ షా రాజీనామా విషయాన్ని కాకుండా బాధితులకు సాయం చేయటం ఎలాగని కాంగ్రెస్ ఆలోచించాలి.

 

అలాగే అల్లర్లను నియంత్రించేందుకు ఏమైనా మార్గాలుంటే కాంగ్రెస్ చెప్పాలి. కేంద్రానికి సలహాలివ్వాలి, సూచనలు చేయాలి. అంతేకానీ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు రాజీనామాలు కోరటం కేంద్రంపై ఆరోపణలు, విమర్శలు చేయటం వల్ల సమస్య మరింతగా పెరుగుతుందని గ్రహించాలి. పరిస్ధితి అదుపులోకి వచ్చిన తర్వాత అప్పుడు రాజకీయాలు మాట్లాడినా ఎవరైనా హర్షిస్తారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: