పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది... ఖర్చు పరంగా భారమైనది ముంపు బాధితుల పునరావాసం. ప్రాజెక్టు భూసేకరణ, పునరావసం కోసమే వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ప్రాజెక్టు నిర్మాణం వేగంగా పూర్తి చేయడంతో పాటు.. ముంపు ప్రాంతాల వాసులకు పునరావాసం కల్పించడం కూడా కీలకం. పునరావస కల్పనలో ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి?

 

పోలవరం ప్రాజెక్టులో భూ సేకరణ వ్యవహారమే కీలకం. లక్షలన్నర ఎకరాల భూసేకరణ జరగాల్సిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు 16 శాతం భూములకు మాత్రమే చెల్లింపులు జరిగాయి. భూ సేకరణతో పాటు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద చెల్లింపులు కూడా చేపట్టాలి. కేవలం ప్రాజెక్టు పనులు చేసుకుంటూ పోవడమే తమ విధానం కాదని.. ముంపు బాధితులకు న్యాయ చేయడం కూడా ముఖ్యమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగా చెప్పారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణంతో పాటు భూ సేకరణకు భారీగా నిధులు అవసరం. 

 

భూసేకరణలో బాగంగా.. ప్రాజెక్టులో ముంపుకు గురయ్యే భూములకు గతంలో ఎకరాకు లక్ష రూపాయలు మాత్రమే పరిహారంగా పొందిన వారికి.. మరో ఐదు లక్షల రూపాయలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా గతంలో పరిహారం తీసుకున్న వారి కి హామీ ఇచ్చిన జగన్...సీఎం హోదాలో కూడా ఈ విషయంపై ఒకటికి రెండు సార్లు ప్రకటన చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 32 వేల ఎకరాల భూమిని.. ఎకరానికి లక్షా 15వేల రూపాయల నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు ఇచ్చారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇప్పుడు ఎకరానికి 10 లక్షలు పైగా చెల్లిస్తున్నారు. దీంతో నాడు భూమి ఇచ్చిన వారికి ఎకరానికి మరో 5 లక్షలు ఇస్తామని జగన్ చెప్పారు. 

 

భూ సేకరణకు వెచ్చించాల్సిన మొత్తంతో పాటు....ఈ 32 వేల ఎకరాలకు.. ఎకరాకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల.. ప్రభుత్వంపై అదనంగా 1700 కోట్ల రూపాయల భారం పడనుంది. ఈ మొత్తం కేంద్రం ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇప్పటి వరకూ కేంద్రం నుంచి సరిగ్గా నిధులు రావడం లేదు. రాష్ట్రం చేసిన ఖర్చులో బాగంగా.. ఇంకా 5వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉంది.  ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల్ని ముందు రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు... కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడంతో.. లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయడం అంత తేలిక్కాదు. దీంతో ఈసారి పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ .. అధికారులకు  ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2021 జూన్ కల్లా పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి కూడా అధికారులపై ఒత్తిడి లేకుండా ... ప్రాజెక్టుని ఏ సమయానికి పూర్తి చెయ్యగలరో అదే చెప్పమని స్వేచ్చ నిచ్చారు. దీంతో 2021 జూన్ నాటికి పనులు అన్నీ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. 2021 అంటే మరో 16 నెలలు మాత్రమే. ఇందులో నాలుగు నెలలు వరదల సమయాన్ని తీసేస్తే... అధికారులు పూర్తి స్థాయిలో పనులు చేయడానికి అందుబాటులో ఉండే సమయం 12 నెలలు మాత్రమే. ఈ నిర్ణీత గడువులో ప్రాజెక్టుని పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయా లేదా అనే అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు.

 

ఏ ప్రాజెక్టు పనిని అయినా అనుకున్న సమాయానికంటే ముందుగా పూర్తి చెయ్యడం మేఘా సంస్థ గొప్పదనంగా ఆ సంస్థ ఉద్యోగులు చెపుతుంటారు. పట్టిసీమ సహా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా....లక్ష్యాన్ని ముందే చేరుకున్న చరిత్ర మేఘా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ సొంతం. రివర్స్ టెండరింగ్‌పై రాజకీయంగా  చర్చ జరగడంతో.. పోలవరం ప్రాజెక్టు పనులపై ఫోకస్ పెరిగింది. దీంతో కంపెనీ ఈ ప్రాజెక్ట్ పనులను సవాల్ గా తీసుకుంది. రాజకీయ ఆరోపణలు, వాగ్వాదాలు ఎలా ఉన్నా.....షెడ్యూల్ ప్రకారం డ్యాం పనులు పూర్తి చేసేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. నిర్ణీత గడువులోగా తమకు అప్పగించిన పనులను పూర్తి చేస్తామంటున్నారు సంస్థ ప్రతినిధులు.

మరింత సమాచారం తెలుసుకోండి: