రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఆశావహుల హడావుడి మొదలైంది. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మొత్తం అధికార పార్టీలే కైవసం చేసుకునే అవకాశముంది. దీంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటు ఆశావహులు అప్పుడే ప్రయత్నాల్లో మునిగిపోయారు. 

 

ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న టి.సుబ్బరామిరెడ్డి, ఖాన్, సీతారామలక్ష్మి, కేశవరావుల పదవీకాలం ముగుస్తోంది.  దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది. వైసీపీలో రాజ్యసభ సీటు ఆశిస్తున్నవారి సంఖ్య భారీగానే ఉంది. నెల్లూరుకు చెందిన బీసీ నేత బీద మస్తాన్ రావు, టీటీడీ ఛైర్మెన్ వైవి సుబ్బారెడ్డి , మంత్రి మెపిదేవి వెంకటరమణ, గోకరాజు రంగరాజు, సినీ నటుడు ఆలీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. వీరితో పాటూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలి ఛీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాంకీ అధినేత అయెధ్యరామిరెడ్డి కూడా రేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే సామాజిక సమీకరణాల లెక్కల్లో ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.

 

బీసీల కోటాలో బీదా మస్తాన్ రావు పేరు దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. అలాగే బిజెపి నేత గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజుకు అవకాశం ఇవ్వడానికే అధిష్టానం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.. మిగిలిన రెండింటిలో మైనార్టీలకు, ఎస్సీలకు ఇస్తారా లేక పదవులు కోల్పోయే మంత్రులకు అవకాశం కల్పిస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.. మరో వారం రోజుల్లో నలుగురు సభ్యుల ఎంపిక ప్రక్రియపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

 

తెలంగాణలోనూ రాజ్యసభ ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణ నుంచి రెండు స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో రాజ్యసభకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ మదిలో ఏముందనేది అంతుచిక్కడం లేదు. సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ అభ్యర్థుల అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీలో టాక్ నడుస్తోంది.

 

మరోసారి అవకాశం కోసం కేశవరావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.  బీసీ సామాజికవర్గంతో పాటూ ఢిల్లీలో అనుభవం ఉన్న నేతగా కేశవరావుకు పేరుంది. దీంతో ఆయనకు మరోసారి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ స్పీకర్ మధుసుధన చారి రాజ్యసభ సీటు రేసులో ఉన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉందన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. జాతీయ స్థాయిలో పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వినోద్ కుమార్ ను రాజ్యసభకు ఎంపిక చేయవచ్చనే ఊహాగానాలు జరుగుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: