ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం...తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం. ఆ పార్టీ ఆవిర్భావించిన దగ్గర నుంచి...అంటే 1983 నుంచి 2004 వరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే అయిదుసార్లు టీడీపీ విజయం సాధించగా, ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది. అయితే 2009 ఎన్నికల నుంచి అద్దంకి కాస్త గొట్టిపాటి రవికుమార్ అడ్డాగా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. 2009లో కాంగ్రెస్ నుంచి తొలిసారి బరిలో దిగిన గొట్టిపాటి..అప్పుడు టీడీపీ అభ్యర్ధి కరణం బలరాంపై విజయం సాధించారు.

 

తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడంతో వైసీపీలోకి వచ్చి, 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగి టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం తనయుడు వెంకటేష్‌పై స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే అధికారం టీడీపీకి దక్కడంతో ఆయన పసుపు కండువా కప్పేసుకున్నారు. పార్టీలోకి వచ్చిన కొన్నాళ్లు కరణం ఫ్యామిలీతో విభేదాలు అలాగే కొనసాగిన, 2019 ఎన్నికల్లో కరణం బలరాంకు చీరాల టికెట్ ఇవ్వడంతో, గొట్టిపాటికి ఇబ్బందులు తప్పాయి. 2019 ఎన్నికల్లో కూడా అద్దంకి నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు.

 

రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్న, తనతో పాటు పార్టీ మారిన వారు ఓడిపోయిన, గొట్టిపాటి మాత్రం గెలుపు గుర్రం ఎక్కగలిగారు. అయితే ఈసారి అధికారం వైసీపీ చేతుల్లోకి వెళ్లడంతో గొట్టిపాటికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయన్ని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయని వార్తలు కూడా వచ్చాయి. పైగా ఆయన గ్రానైట్ వ్యాపారంపై విజిలెన్స్ దాడులు జరగడంతో, పార్టీ మారడం ఖాయమైపోయిందని ప్రచారం జరిగింది.

 

ఎంత ప్రచారం జరిగిన గొట్టిపాటి మాత్రం టీడీపీని వీడలేదు. అవన్నీ వదిలేసి నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిధులు అందకపోయిన, నిత్యం జనాలకు అందుబాటులో ఉంటున్నారు. పైగా ఇటీవల అద్దంకిలో జరిగిన అధినేత చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర విజయవంతం కావడంతో ఆయన కాన్ఫిడెన్స్‌గా పని చేసుకుంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందనే నేపథ్యంలో స్థానిక సమరంలో టీడీపీని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

అయితే గొట్టిపాటి అధికార వైసీపీ మీద అసలు విమర్శలు చేసిన సందర్భాలు లేవు. ఏం మాట్లాడితే, ఏం చిక్కులు వస్తాయనో ఏమో గానీ సైలెంట్ గానే ఉంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే గొట్టిపాటి ప్రయాణం సైకిల్ మీదే కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: