ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం ఈఎస్‌ఐ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ నేతలు టీడీపీ మాజీ మంత్రులకు ఈ కుంభకోణంలో పాత్ర ఉందని విమర్శలు చేశారు. టీడీపీ నేతలు ఈ కుంభకోణానికి తమకు సంబంధం లేదని వైసీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని చెబుతున్నారు. వైసీపీ టీడీపీ పార్టీల మధ్య గత కొన్ని రోజుల నుండి ఈ కుంభకోణం విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. 
 
తాజాగా వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఈఎస్‌ఐ కుంభకోణం విషయంలో చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు చేశారు. గుమ్మనూరు జయరాం ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలోని ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈఎస్‌ఐ కుంభకోణం గురించి మంత్రి స్పందించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 300 కోట్ల రూపాయల స్కామ్ బయటపడిందని... త్వరలోనే అవితినీతి మొత్తం బయటపడుతుందని చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు. 
 
చంద్రబాబుతో పాటు అప్పట్లో కార్మిక శాఖా మంత్రులుగా పని చేసిన అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ కూడా జైలుకు వెళతారని చెప్పారు. టీడీపీ హయాంలో అడ్డంగా దోపిడీ చేశారని... అన్ని శాఖల్లో దోపిడీ జరిగిందని ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిలో చంద్రబాబు కూడా ముద్దాయి అని చెప్పారు. మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 
 
ఐదు రోజుల క్రితం ఏపీలో ఈఎస్‌ఐ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గత ఆరేళ్లుగా ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం జరిగినట్టు నివేదిక ఇచ్చారు. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. అచ్చెన్నాయుడు చొరవతోనే 100 కోట్ల రూపాయలకు పైగా నకిలీ బిల్లులు సృష్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: