అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం వాషింగ్టన్ లో ల్యాండ్ అయినట్టు ట్రంప్ ట్వీట్ చేశారు. తన పర్యటన విజయవంతంగా సాగిందని భారత్ గొప్ప దేశమని ట్రంప్ ట్వీట్ లో పేర్కొన్నారు. నిన్న రాత్రి 10.30 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి తిరుగు ప్రయాణమైన ట్రంప్ సాయంత్రం 6 గంటలకు వాషింగ్టన్ కు చేరుకున్నారు. 
 
ట్రంప్ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య బంధం బలపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాలు తమ స్వీయ ప్రయోజనాలకు పెద్దపీట వేయడంతో వాణిజ్య ఒప్పందం కుదరలేదు. భారత్ అమెరికా నుంచి 3 బిలియన్ డాలర్ల విలువైన హెలికాఫ్టర్లు, సైనిక పరికరాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. 
 
ట్రంప్ భారత్ కు ఎంహెచ్ 60 రోమియో, అపాచీ హెలికాఫ్టర్లను అందజేస్తామని చెప్పారు. ఈ పర్యటనలో ట్రంప్ భారతదేశాన్ని ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. భారత్ అమెరికాకు మంచి ఫ్రెండ్ అని వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు అమెరికన్ల హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్న ట్రంప్ మోదీ జీవితం ఎంతోమందికి ఆదర్శం అని అన్నారు, గొప్ప ఆతిథ్యమిచ్చిన భారత్ కు కృతజ్ఞతలని ఈ పర్యటన తనకు ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. 
 
ప్రపంచంలో అందరూ మోదీని అభిమానిస్తారని మోదీ చాలా ఖచ్చితమైన వ్యక్తి అని చెప్పారు. మోదీ నిరంతరం భారత్ అభివృద్ధి కోసం కృషి చేస్తారని అన్నారు. భారత రక్షణ రంగానికి అత్యాధునికమైన ఆయుధాలు త్వరలో సమకూరుతాయని చెప్పారు. ఇరు దేశాలు స్వేచ్ఛాయుత వాణిజ్యం గురించి చర్చలు జరిపామని అన్నారు. ఇంధన సహకారంపై ప్రత్యేకంగా చర్చలు జరిపామని చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: