మనం అన్నీ చాలా శీఘ్రంగా జరిగిపోవాలనుకుంటాం! అందుకే ‘శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు’, ‘శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు’.. అంటూ రకరకాల శీఘ్ర దీవెనలు వింటుంటాం. ఏ పనైనా త్వరత్వరగా జరిగిపోవటం మంచిగానే అనిపిస్తుంటుందిగానీ... ఒక్క విషయంలో మాత్రం కాలాన్ని ఎంత వీలైతే అంతసేపు ఆపాలనీ.. మరికాస్త సమయం అలాగే గడిస్తే బాగుణ్ణనీ గాఢంగా భావిస్తుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఆ కాస్త కాలం శీఘ్రంగా ముగిసిపోతే ఎంతో అసంతృప్తికీ, ఆవేదనకు గురవుతుండటం సహజం! అందుకే శీఘ్ర స్ఖలనాన్ని- ప్రపంచవ్యాప్తంగా పురుషులను ఆవేదనకు గురి చేస్తున్న అతి పెద్ద లైంగిక సమస్యగా చెప్పుకోవాల్సి వస్తోంది. తన అసంతృప్తికి తోడు.. తన కారణంగా భాగస్వామి కూడా అసంతృప్తికి లోనవ్వాల్సి వస్తోందన్న భావన మనసులో పీడిస్తుండటం దీని తీవ్రతను మరింత పెంచుతోంది.

 

స్ఖలనమన్నది మనసూ-శరీరం.. మెదడూ-కండరాలూ సమన్వయంతో సాధించే సంక్లిష్టమైన ప్రక్రియ, గాఢానుభూతి. లైంగిక సంతృప్తికి ఎంతో కీలకమైన ఈ ప్రక్రియ అనూహ్యంగా, వేగంగా ముగిసిపోతే ఎంత వేదనకు లోనవుతారో సకాలంలో ఆ భావన కలగకపోయినా అంతే సమస్యగా తయారవుతుంది. నిజానికి శీఘ్రం, జాప్యం రెండే కాదు.. స్ఖలన సమయంలో నొప్పి, బాధ; ఒక్కోసారి వీర్యం బయటకు రాకుండా వెనక్కిపోవటం వంటి సమస్యలూ ఎదురవ్వచ్చు. వీటిని అధిగమించటంలో ఆధునిక వైద్యం మంచి పురోగతే సాధించింది. స్ఖలన సమస్యలు..   ప్రపంచవ్యాప్తంగా పురుషులు ఎదుర్కొనే లైంగిక సమస్యల్లో చాలా సర్వసాధారణంగా, చాలా ఎక్కువగా కనబడే సమస్య- శీఘ్ర స్ఖలనం. ఎంతోమంది దీనితో లోలోపల అసంతృప్తికి లోనవుతూనే ఉన్నా బయటకు చెప్పుకోవటానికి ఇష్టపడరు. చిన్నతనంగా భావిస్తూ దీనికి చికిత్స తీసుకునే ప్రయత్నాలు కూడా చెయ్యరు. అయితే దీనికి బలమైన కారణం లేకపోలేదు.

 

ఒకప్పుడు శీఘ్రస్ఖలనానికి సమర్థ చికిత్సలేవీ ఉండేవి కూడా కావు. వైద్యులు కూడా దీన్ని మానసిక సమస్యల గాటన కట్టేవారు. చాలాసార్లు దీనికి శాస్త్రీయమైన ఆధారాలేవీ లేకపోయినా ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు వాడే మందులే వాడేవారు. పరిస్థితి ఏమంత మెరుగవ్వకపోవటం మూలంగా ప్రజల్లో దీనికి సమర్థమైన చికిత్సలే ఉండవన్న భావన బలపడింది. కానీ ఇప్పుడీ విషయంలో వైద్యశాస్త్రం, పరిశోధనా రంగం ఎంతో అభివృద్ధి చెందాయి. నేరుగా స్ఖలనానికి సంబంధించిన మెదడు కేంద్రాల మీదే పని చేసే మందుల వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శీఘ్రస్ఖలనమన్న సమస్యను అర్థం చేసుకునే తీరులోనే ఎంతో మార్పు వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: