ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసమని సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని, దాదాపు రెండు నెలలు దాటేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదు కానీ, ఈలోపే రాష్ట్రంలో జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నానా రచ్చ చేస్తున్నారు. అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలంటూ ఆందోళనలు, నిరసనలు చేశారు. అయితే ఈ మూడు రాజధానుల నిర్ణయం వెలువడ్డాక చంద్రబాబు మాత్రం ఉత్తరాంధ్ర వైపు వెళ్లలేదు.

 

కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తిరిగారు గానీ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వైపు కన్నెత్తి చూడలేదు. అయితే ఇటీవల జగన్ ప్రభుత్వం అన్నీ విధాల విఫలమైందని చెబుతూ...చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా పర్చూరు, చిత్తూరు కుప్పంలలో పర్యటించిన బాబు...ఇప్పుడు విజయనగరం జిల్లా వెళ్లడానికి సిద్ధమయ్యారు. 27 తేదీన విజయనగరంలో అడుగుపెట్టనున్నారు. మొదట విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో దిగి, అక్కడ నుంచి విజయనగరంలోని శృంగవరపుకోట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తర్వాత గణపతి నగరం, విజయనగరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.

 

ఇక మూడు రాజధానుల నిర్ణయం వచ్చాక, చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌  కావడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు ఎలాంటి స్వాగతం పలుకతారనేది ఆసక్తికరంగా మారింది. పైగా అక్కడకి వెళ్ళాక చంద్రబాబు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పగలరా? చెప్పి అక్కడి ప్రజలని ఒప్పించగలరా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

 

ఒకవేళ చంద్రబాబు విజయనగరం పర్యటనలో అమరావతికి జై కొట్టిస్తే, జగన్‌కు ఇబ్బందులు మొదలవుతాయి. అలా కాకుండా అమరావతికి అక్కడి ప్రజలు స్పందించకపోయినా, అసలు బాబు అమరావతి గురించి మాట్లాడకపోయినా, జగన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు రాజధానులపై ముందుకెళ్లిపోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే.. చంద్రబాబు విజయనగరం వెళ్లి మరి... జగన్‌కు మూడు రాజధానులపై ముందుకెళ్లమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: