రాజకీయాల్లో ఒకసారి కాకపోయిన, ఒకసారైనా అదృష్టం కలిసొస్తుంది. అలా కాకుండా ఎప్పుడు దురదృష్టమే వెంటాడితే అంతకంటే దురదృష్టవంతుడు మరొకరు ఉండరు. ఇలా ఏపీ రాజకీయాల్లో ఎవరైనా దురదృష్టవంతుడు ఉన్నారంటే అది టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డినే. వరుసగా ఆయన ఎన్నికల్లో ఓటమినే చవిచూస్తున్నారు...తప్ప గెలుపు మొహం అసలు చూడటం లేదు.

 

రెడ్డి సామాజికవర్గానికి చెందిన సోమిరెడ్డి...తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి 1994, 1999 ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి విజయం సాధించి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. అయితే వరుసగా గెలవడం, మంత్రి పదవి దక్కించుకోవడంతో సోమిరెడ్డికి తిరుగులేదు అనుకున్నారు. కానీ 2004 నుంచే సోమిరెడ్డి దురదృష్టం మొదలైంది.

 

2004లో వైఎస్సార్ హవాలో సోమిరెడ్డి సర్వేపల్లి నుంచి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. సరే ఈ సారి కష్టపడి సత్తా చాటాలని అనుకున్న సోమిరెడ్డికి 2009 ఎన్నికల్లో కూడా షాక్ తగిలింది. మళ్ళీ ఆదాలపై ఓడిపోయారు. ఈసారి కూడా వైఎస్ గాలే ఉందనుకుని సర్దుకుపోయిన సోమిరెడ్డికి, 2012 ఉపఎన్నికల్లో జగన్ రూపంలో షాక్ తగిలింది. కొవ్వూరు ఉపఎన్నికల్లో పోటీ చేసి సోమిరెడ్డి ఓడిపోయారు.

 

తర్వాత 2014లో ఏపీలో టీడీపీ గాలి ఉన్న విజయం దక్కలేదు. 2014లో మళ్ళీ పోటీ చేస్తే, వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే సోమిరెడ్డి ఓడిపోయిన చంద్రబాబు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి కూడా ఇచ్చారు. దీంతో ఐదేళ్లు బాగానే గడిచాయి. ఇక 2019 ఎన్నికలు వచ్చిన సోమిరెడ్డి తలరాత మారలేదు. మళ్ళీ ఓటమి రిపీట్ అయింది. ఈసారి జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. ఇలా నాలుగోసారి ఓడిపోవడంతో, సోమిరెడ్డి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదు.

 

ఏదో మీడియా ముందుకొచ్చి, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు తప్ప, నియోజకవర్గంపై దృష్టి పెట్టే కార్యక్రమం చేయడం లేదు. పైగా సర్వేపల్లి వైసీపీ కంచుకోటగా మారిపోవడం, భవిష్యత్‌లో కూడా గెలుపు దక్కడం కష్టమనే భావనలో సోమిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఈసారి వేరే నియోజకవర్గం మారడం లేదా కుమారుడుని పోటీలోకి దించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికైతే సర్వేపల్లిలో సోమిరెడ్డి చేతులెత్తేసినట్లే కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: