దాదాపు 45 రోజుల క్రితం ఏపీలో బీజేపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ విమర్శలు చేసిన పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. రానున్న స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇరు పార్టీలు కలిసి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. 
 
బీజేపీ జనసేన పొత్తులో భాగంగా కొందరు జనసేన ముఖ్య నేతలకు పదవులు కూడా దక్కుతాయని ప్రచారం జరిగింది. కానీ గడచిన కొన్ని రోజుల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. జగన్ కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. జగన్ బీజేపీతో చెలిమి చేస్తూ ఉండటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. 
 
తాజాగా బీజేపీ జనసేన బ్రేకప్ దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలోనే బీజేపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తే విడిపోవడం ఖాయమని పవన్ ప్రకటన చేశారు. బీజేపీతో జనసేన బ్రేకప్ కు డేట్ ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. మార్చి 13వ తేదీన జనసేన బీజేపీ బంధం విడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నిన్న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. 
 
మార్చి 13వ తేదీ రాజ్యసభ సీట్ల నామినేషన్ దాఖలుకు చివరి తేదీ. వైసీపీ నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి బీజేపీకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ వైసీపీ నుండి తమ అభ్యర్థికి నామినేషన్ వేయిస్తే జనసేన బీజేపీ బంధానికి అదే చివరిరోజు కానుంది. జగన్ బీజేపీకి రాజ్యసభ సీటు ఇస్తారా...? పవన్ బీజేపీకి దూరమవుతారా...? అనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.           

మరింత సమాచారం తెలుసుకోండి: