తెలుగుదేశంపార్టీకి సీన్ అర్ధమైపోయినట్లుంది. తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో  విమర్శలు చేయటానికి చంద్రబాబునాయుడు అండ్ కో కు పెద్దగా అంశమేది కనబడటం లేదు. అందుకనే ఒకదానికొకటి సంబంధం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. కాసేపు ట్రంప్ విందంటారు. వెంబడే దావోస్ గురించి మాట్లాడుతారు. తర్వాత రూ. 16 లక్షల దోపిడంటారు. అప్పుడే నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు గురించి మాట్లాడేస్తారు.

 

అదేదో సినిమాలో ఎంఎస్ నారాయణ సుడిగాలి లాగ వచ్చి నోటికొచ్చింది ఏదేదో మాట్లాడేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తారు గుర్తుందా ? అలానే అయిపోయారు టిడిపి నేతలు కూడా. చంద్రబాబు దగ్గర నుండి పంచుమర్తి అనూరాధ వరకూ అందరిదీ ఒకటే వరస. కుప్పంలో చంద్రబాబు, విజయవాడలో అనూరాధ మాటలు వింటే ఈ విషయం స్పష్టమైపోతుంది. వీళ్ళు లేవనెత్తుతున్న అంశం ఏమిటంటే ట్రంప్ విందుకు జగన్ కు ఆహ్వానం అందకపోవటం. నిజానికి ఈ అంశం పనికిమాలిన అంశమనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ దీన్నే టిడిపి చాలా పెద్ద సమస్యగా, ఏపికి జీవన్మరణ సమస్యగా చిత్రీకరిస్తోంది.

 

విషయం ఏమిటంటే మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్  విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన విందుకు వివిధ రంగాల్లోని సుమారు 100 మందికి ఆహ్వానాలు అందాయి. ఇందులో ఎనిమిది మంది సిఎంలను మాత్రమే ఆహ్వానించారు. విందుకు ఎవరిని ఆహ్వానించాలి ? ఎవరిని పక్కన పెట్టేయాలన్న విషయం పూర్తిగా  రాష్ట్రపతి కార్యాలయం ఇష్టం.

 

అసలు విందుకు జగన్ కు ఆహ్వానం వస్తే ఏపికి వచ్చే లాభమేంటి ? ఆహ్వానం అందకపోతే రాష్ట్రానికి జరిగే నష్టమేంటి ? అన్న కోణంలో కాకుండా  కేసులున్నాయి కాబట్టే జగన్ ను విందుకు పిలవలేదని వీళ్ళే ఫైనల్ చేసేశారు. ఓకే ఇదే నిజమనుకుందాం కాసేపు. కానీ అక్కడతో ఆగటం లేదు వీళ్ళు.

 

ట్రంప్ విందుకు తనకు ఎందుకు ఆహ్వానం అందలేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. కారణం వీళ్ళే చెప్పేసిన తర్వాత మళ్ళీ జగన్ చెప్పేదేముంటుంది ? పైగా జగన్ దోచేసిన లక్ష కోట్ల రూపాయలు వెంటనే తిరిగిచ్చేయాలట. లేకపోతే చేసిన తప్పులు ఒప్పేసుకుని జైలుకు వెళ్ళిపోవాలట. దానికన్నా ముందు ముఖ్యమంత్రిగా రాజీనామా కూడా చేయాలట. అసలేమన్నా సంబంధం ఉందా ?  వీళ్ళ మాటలు వింటే మెదడువాపు వ్యాధి రావటం ఖాయం.  మరీ మీడియా వాళ్ళు అంతంత సేపు ఎలా కూర్చుంటున్నారో పాపం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: