ఏపీ సీఎం జగన్ అన్ని వర్గాలపైనా ప్రేమ కురిపిస్తూ సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి రాయితీలు, సంక్షేమ పథకాలు అందుకోని అగ్రకులస్తుల కోసం కూడా ఆయన వినూత్న పథకాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఆయన నిరుపేద బ్రాహ్మణుల కోసం ఓ అద్భుత పథకాన్ని ప్రకటించారు. అదేంటంటే.. పేద బ్రాహ్మణ కుటుంబాల్లో ఉపనయనం లేదా ఒడుగు చేసుకోవడానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించారు.

 

ఈ మేరకు ఓ నూతన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తు జరుగుతోంది. 7–16 ఏళ్ల మధ్య వయసున్న పేద బ్రాహ్మణులు ఉపనయనం చేసుకుంటే ఈ ఆర్థిక సాయం అందజేస్తారు. సాధారణంగా ఇలాంటి ఉపనయనం చేయాలంటే పేద బ్రాహ్మణులు ఆ ఖర్చు తట్టుకోలేరు. అందుకే పేద బ్రాహ్మణులు ఈ కార్యక్రమం నిర్వహించలేకపోతున్నారు.

 

ఇప్పుడు జగన్ సర్కారు నిర్ణయంతో వారంతా ఆనందం వ్యక్తం చేసున్నారు. ఇవే కాదు.. పేద బ్రహ్మణుల కోసం మరిన్ని కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ అమలు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా రూ.100 కోట్లతో వివిధ పథకాలు అమలవుతున్నాయి. 15 వేల మంది బ్రాహ్మణులకు ప్రతి నెలా పింఛను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

వేదవ్యాస, గాయత్రి, కల్యాణమస్తు, గరుడ, భారతి తదితర పథకాల కింద ఇప్పటిదాకా 22,056 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారందరికీ త్వరలో ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. వాస్తవానికి పేదరికానికి కులంతో పనేముంది.. పేదరికంలో ఉంటే అగ్రకులస్తులు మాత్రం ఇబ్బందులు పడటం లేదా. అందుకే ఇలాంటి పథకాలు వారికి ఊరటనిస్తాయనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: