1984 అల్లర్ల వంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో పరిస్థితులు చూస్తుంటే ప్రతి పౌరుడికి Z కేటగిరి భద్రత కల్పించాల్సిన సమయం వచ్చిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న నేతలపై FIRలు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.  

 

ఈశాన్య ఢిల్లీ ఘర్షణలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవి. ఢిల్లీ ఘర్షణల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో సుధీర్ఘంగా విచారణ జరిగింది.  ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 1984 నాటి ఘర్షణలను ప్రస్తావించింది. అలాంటి పరిస్థితులు ఢిల్లీలో పునరావృతం కానివ్వబోనియమన్న కోర్టు...తక్షణం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించాలని సూచించింది.

 

ప్రజల్లో ధైర్యం నింపేందుకు బాధితులు, వారి కుటుంబాలను ఉన్నతాధికారులు పరామర్శించాలని సూచించింది. హెల్ప్‌లైన్లు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు సాయం చేయాలని స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలతో మాట్లాడి అంత్యక్రియలు సజావుగా సాగేలా చూడాలి అని కోర్టు ఆదేశించింది. ఘర్షణలో ఇంటెలిజెన్స్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోవడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పౌరుడికి జెడ్‌ కేటగిరి భద్రత కల్పించాల్సిన సమయం వచ్చిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. 

 

మరోవైపు బీజేపీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. FIRలు నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోలీసులను నిలదీసింది. FIRలు నమోదు చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మలు ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను ఓపెన్ కోర్టులో ప్రదర్శించింది న్యాయస్థానం. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో రేపటి లోగా తెలపాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది..తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: