ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు  దర్యాప్తు బృందం (సిట్ ) ఎవరెవర్ని విచారించనుందన్నదిప్పుడు హాట్ టాఫిక్ గా మారింది . మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా జగన్ సర్కార్,  సిట్ ఏర్పాటు చేసిందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి . చంద్రబాబు , లోకేష్ లను  అవసరమైతే విచారించాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది .  అదే జరిగితే  రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగే అవకాశముంది . ఇప్పటికే సిట్ ఏర్పాటు ను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది . అసలు ఏ ప్రాతిపదికన సిట్ ఏర్పాటు చేశారో చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు .

 

అయినా రాష్ట్ర ప్రభుత్వం విపక్షాల విమర్శలను ఖాతరు చేయకుండా సిట్ కు విశేషాధికారాలు కట్టబెట్టింది .   గత టీడీపీ ప్రభుత్వ హయాం లో సాగునీటి ప్రాజెక్టుల్లో  పెద్ద ఎత్తున అక్రమాలు  జరిగాయని  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆరోపిస్తోన్నవిషయం తెల్సిందే .  సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే  బాధ్యతను కూడా  సిట్ కు అప్పగించింది జగన్ సర్కార్ . సాగునీటి ప్రాజెక్టుల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు మైలవరం ఎమ్మెల్యే ఆరోపించడమే కాకుండా,  సిట్ కు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు . దీనితో దేవినేని సిట్ విచారించే అవకాశాలు లేకపోలేదు .

 

ఇక గత ప్రభుత్వ హయాం లో  రాజధాని అమరావతి ప్రాంతం  పెద్ద ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి  ఆరోపిస్తున్న విషయం తెల్సిందే . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని ప్రాంతం లో భూకొనుగోళ్ల వ్యవహారంపై సీ ఐ డీ విచారణకు ఆదేశించింది . భూకొనుగోలు వ్యవహారం లో ఇప్పటికే మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు , నారాయణలపై ఒక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీ ఐ డీ కేసులు నమోదు చేసిన విషయం తెల్సిందే  .  అటు సిట్ , ఇటు సీ ఐ డీ విచారణ ద్వారా మాజీ మంత్రులను ఉక్కిరి , బిక్కిరి చేయాలన్నది జగన్ సర్కార్ వ్యూహంగా కన్పిస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: