పటాన్ చెరు లోని నారాయణ కాలేజీ క్యాంపస్ లో  కూతురు  ఆత్మహత్య చేసుకుని పుట్టెడు దుఃఖం లో ఉన్న తండ్రి పట్ల పోలీసు కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు సీరియస్ అయ్యారు . ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినీ తండ్రిని  కాలితో తన్నిన కానిస్టేబుల్ పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన హోంమంత్రి  మహమూద్ అలీ , డీజీపీ మహేందర్ రెడ్డిలను కోరారు . కానిస్టేబుల్ వ్యవహారశైలి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్న నేపధ్యం లో కేటీఆర్ స్పందించి , విచారించాలని సంబంధిత మంత్రిని , డీజీపీ ని కోరడం బాధిత కుటుంబానికి ఒకింత ఊరటనే   చెప్పాలి .

 

వివరాల్లోకి వెళితే ...  సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లోని నారాయణ కాలేజీ క్యాంపస్ లో ఒక విద్యార్థినీ ఆత్మహత్య చేసుకుంది . విద్యార్థినీ మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా , విద్యార్థి సంఘాలు విద్యార్థినీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి . విద్యార్థినీ మృతదేహాన్ని వారు మార్చురీ నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు   ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు . విద్యార్థి సంఘాల నేతలకు , పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది . అయితే ఆందోళన లో పాల్గొన్న విద్యార్థినీ తండ్రిని ఒక పోలీసు కానిస్టేబుల్ కాలితో తన్ని ఈడ్చుకువెళ్ళే దృశ్యం ప్రతి ఒక్కర్ని కలిచివేసింది .

 

కానిస్టేబుల్ వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడం , సాక్షాత్తు మంత్రి కేటీఆర్ , విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు . వెంటనే సదరు కానిస్టేబులు ను సంగారెడ్డి విఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు . విచారణ జరిపి అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు .    

మరింత సమాచారం తెలుసుకోండి: