ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఐదేళ్ల పాటు అమరావతి రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ను పాలించినా.. ఇప్పటి వరకూ ఆ ప్రాంతంలో సొంత ఇల్లు నిర్మించుకోలేదు. చంద్రబాబు శాశ్వత నివాసం ఇప్పటికీ హైదరాబాదే. హైదరాబాద్ లో ఉన్న పాత ఇంటిని చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాకే రీ మోడలింగ్ చేయించుకున్నారు కూడా. అయితే ఏపీ రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లులేని చంద్రబాబు, లోకేశ్ లకు జగన్ సర్కారు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

 

 

రాజధాని ప్రాంతంలో సుమారు 55 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 1251 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం సుమారు 2600 ఎకరాలు 5 శాతం ఆర్థికంగా వెనుకబడి పేదల కోసం కేటాయించాలి. ఆ చట్టానికి లోబడి సీఎం వైయస్‌ జగన్‌ పేదల కోసం 1251 ఎకరాలు కేటాయించారు. అయితే రాజధాని భూములను పట్టాలుగా పంచుతున్నారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు తీరుపై సెటైర్లు వేశారు.

 

 

ప్రతి మనిషి సొంతిల్లు ఉండాలని కనే కలను సీఎం నిజం చేస్తున్నారని చెబుతూనే... వాచీ, ఉంగరం లేదని బీరాలు పలికే చంద్రబాబు అమరావతిలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారు దరఖాస్తు చేసుకుంటే ఓ వాలంటీర్‌ ఇంటికి వచ్చి మీ తండ్రీకొడుకులు అర్హులో కాదో.. తేల్చుతారని, ఒక సెంట్‌ స్థలం వస్తుందని తెలిపారు.

 

 

అమరావతిలోకి రాజధానిలోకి పేదలు, దళితులు, ముస్లింలు, బీసీలు ఎవరూ కాలు పెట్టేందుకు వీల్లేదు అన్నట్లుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని ఆర్కే మండిపడ్డారు. అమరావతిలోని భూములను పెద్ద కంపెనీలకు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుందామనే చంద్రబాబు ఆలోచనకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అడ్డుకట్ట వేశారన్నారు. రాజధానిలో గొప్ప వారు మాత్రమే ఉండాలా..? పేదవాడు ఉండకూడదా..? చంద్రబాబూ అని ప్రశ్నించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: