ఇటీవల జరిగిన ఢిల్లీ హింసాకాండలో అధికారిక గణాంకాల ప్రకారం 27 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. అయితే మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రముఖ జర్నలిస్టులు సామాజిక మాధ్యమాలలో చెప్పుకొస్తున్నారు. అల్లర్లలో గాయపడి ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 38 మంది చనిపోయారని సమాచారం. కేవలం సామాన్యలు మాత్రమే కాదు పోలీసు ఉద్యోగులు కూడా ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఐతే ప్రస్తుతం ఒక వార్త అందరి కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. అదేంటంటే మంగళవారం రోజు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబి)అధికారి అంకిత్ శర్మ(26) ఢిల్లీలోని అల్లర్లలో అతి కిరాతకంగా చంపబడ్డాడు.




మృతుడి తల్లి మాట్లాడుతూ... 'నా కొడుకు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. వెంటనే నేను టీ ప్రిపేర్ చేసి తనని తాగమన్నాను. కానీ మా ఇంటి పక్కన నివసిస్తున్న వాళ్లు వచ్చి 'బయట కొంతమంది దుండగులు ప్రజలను చంపేస్తున్నారు' అని చెప్పారు. ఇది విన్న అంకిత్ బయటికి వెళ్తుంటే నేను ఆపి వెళ్లొద్దు అని చెప్పాను. అయినా తను నా మాట వినలేదు. కనీసం టీ తాగమని చెప్పిన వినకుండా బయటికి వెళ్లాడు. బయటకి వెళ్లిన వెంటనే అల్లర్లు చేస్తున్న దుండగులు నా కొడుకుని కొట్టుకుంటూ వీధుల వెంట లాక్కెళ్లారు. చివరికి అతన్ని చంపేసి ఒక డ్రైనేజీ లో పడేశారు', అని చెబుతూ ఆమె గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరు అయింది.




ఎంతో ఆప్యాయతో గారాబంగా పెంచుకున్న తన కుమారుడిని వీధుల వెంట ఓ యాంటీ సిఏఏ నిరసనకారులు ఈడ్చుకెళ్తున్నారని తెలుసుకున్న తల్లి ఒక్కసారిగా నిర్ఘాంత పోయింది. నిరసనకారులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లగా... అక్కడి అధికారులు వేరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని ఆమెను పంపించేశారు. దీంతో ఏం చేయాలో తెలియక తన కొడుకు తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటూ ఆ రాత్రి మొత్తం నిద్రపోకుండా వేచి చూసింది. గంటలు గడిచినా తన కొడుకు ఇంటికి రాకపోయేసరికి... తానే ఒంటరిగా తన కొడుకు కోసం తిరగసాగింది. కానీ చివరికి తన కొడుకు ఒక మురికి కాలవలో చనిపోయి ఉన్నాడని తెలిసి గుండె బద్దలయ్యేలా విలపించింది.




అంతా అయిపోయిన తర్వాత ఈ ఘటనలో మౌన ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు తీవ్ర విషాదం లో ఉన్న మృతుడి కుటుంబం వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. అయితే మృతుడు అంకిత్ శర్మ తండ్రి మాట్లాడుతూ తన కొడుకుని స్థానిక కౌన్సిలర్ కొంతమందితో కలిసి చంపేశారని ఆరోపిస్తున్నాడు. ఏదేమైనా గత మూడు దశాబ్దాలలో ఇటువంటి విధ్వంసం ఎప్పుడూ జరగలేదని ఈశాన్య ఢిల్లీ ప్రజలు భయపడుతూ చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలే కారణంగానే అల్లర్లు జరిగాయని, ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయిన బిజెపి నేతలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరసన చేసేవారిని కుక్కని కాల్చినట్లు కలుస్తామని చెప్పడం వల్లనే ఈ విధ్వంసం చోటు చేసుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ రంగంలోకి దిగి చాలా వరకు శాంతి నెలకొల్పారు. ప్రస్తుతం అల్లర్లు సద్దుమణిగినప్పటికీ.. సోమవారం, మంగళవారం జరిగిన దాడిలో గాయపడిన వారు ఒక్కొక్కరిగా మరణిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: