బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలు.... బోసిపోయిన వీధులు.. అడుగడుగునా రాళ్లు, ఇటుకలు, గాజు ముక్కలు.. ధ్వంసమైన వాహనాలతో నిండిన రోడ్లు.. కాలిపోయిన దుకాణాలు, ఇది ప్రస్తు తం ఢిల్లీలో కనిపిస్తున్న విషాద దృశ్యాల ప‌రిచ‌యం. చాంద్‌బాగ్‌, జఫ్రాబాద్‌, భజన్‌పురా, యమునావిహార్‌, మౌజ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో వీధులన్నీ విధ్వంసపు సాక్ష్యాలుగా మిగిలాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న హింసతో దేశ రాజధాని విధ్వంసమైంది.  గోకుల్‌పురి సహా కొన్నిచోట్ల అల్లర్లు బుధవారం కూడా కొనసాగాయి. అల్లరి మూకలు స్వైరవిహారం చేశాయి. దుకాణాలను, వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ నేప‌థ్యంలో... ఈ క‌ల‌క‌లం కేంద్ర మంత్రి అమిత్‌షాను టార్గెట్ చేసే వ‌ర‌కూ వెళ్లింది. 

 

ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే ఓ పోలీస్‌ సహా 14 మంది దుర్మరణం చెందారు. దీంతో మృతుల సంఖ్య 27కు పెరిగింది. ప‌రిస్థితిని గాడిలో పెట్టేందుకు భద్రతా బలగాలను భారీగా మోహరించడంతో ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. దుకాణాలు, పాఠశాలలను మూసివేయించారు. ప్రజలు ఇళ్ల‌ల్లో నుంచి బయటికి రావొద్దని హెచ్చరించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గాలను మూసివేశారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన కుటుంబాలను సురక్షితంగా వారి బంధువుల నివాసాల‌కు చేర్చారు. ఆయా ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్టు ఢిల్లీ మెట్రోరైలు సంస్థ ప్రకటించింది. నేడు జరుగాల్సిన సీబీఎస్‌ఎస్‌ఈ 12వ తరగతి  ఇంగ్లిష్‌ పరీక్షను ఈశాన్య ఢిల్లీ పరిధిలో వాయి దా వేస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. 

 

కాగా, ప్రధాని మోదీ తొలిసారి ఢిల్లీ హింసపై స్పందించారు. ప్రజలంతా శాంతియుతంగా, సోదరభావంతో ఉండాలని పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో నెలకొన్న పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించినట్టు చెప్పా రు. శాంతిభద్రతలు నెలకొనడం, పరిస్థితిని అదుపులోకి తేవడానికి తొలిప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, ఇతర బలగాలు, ఏజెన్సీలు కృషిచేస్తున్నాయని ఆయ‌న అన్నారు. 

 

మ‌రోవైపు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఢిల్లీ అల్లర్లపై చర్చించి, తీర్మానం చేశారు. అనంతరం సోనియా మీడియాతో మాట్లాడుతూ...ఢిల్లీ లో జరుగుతున్న పరిణామాల వెనక ప్రణాళికాబద్ధమైన కుట్ర ఉన్నదని ఆరోపించారు. ‘ఢిల్లీ ఎన్నికలప్పుడు బీజేపీ నేతలు తమ ప్రసంగాలతో ప్రజల మధ్య విద్వేషం, భయానక వాతావరణాన్ని సృష్టించారు. బీజేపీ నేత కపిల్‌ మిశ్రా పోలీసులకు మూడు రోజులు గడువు ఇస్తున్నానంటూ రెచ్చగొ ట్టారు. అయినా ప్రభుత్వాలు మిన్నకుండిపోవడంతో 72 గంటల్లో 20 మందికిపైగా మరణించారు’ అని విమర్శించారు. ఆదివారం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఈశాన్య ఢిల్లీలో హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, నైతిక బాధ్యత వహిస్తూ అమిత్‌ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాలని భావించినా.. గురువారం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంతో నేటికి వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: