ఏపీలో విద్యుత్ కష్టాలకు కాస్త ఉపశమనం లభించనుంది. ఏపీలో ప్లాంట్ పెట్టేందుకు కేంద్ర సంస్థ.. ఎన్టీపీసీ ముందుకు వచ్చింది. తమ ప్లాంట్ కు అవసరమైన స్థలం చూపించాలంటూ ఆ సంస్థ రాష్ట్రాన్ని సంప్రదించింది. రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు వచ్చిందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకు వచ్చారు.

 

 

వారికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. రాష్ట్రంలోని విద్యుత్‌రంగంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఈ విషయం సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 10వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణంపై కూడా ఈ సమావేశంలో అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు.

 

 

వీలైనంత త్వరగా సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర విద్యుత్‌ కోసం ఫీడర్ల ఆటోమేషన్‌ ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యమని జగన్‌ అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామన్నారు.

 

 

ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ ఉండాలని అధికారులకు జగన్ సూచించారు. లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపైనా ఆయన చర్చించారు. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: