ఈ మద్య రోడ్డు పక్కవైపు ఉన్న కాలువల్లోకి కార్లు దూసుకు వెళ్లడం.. నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరుగుతున్నాయి.  కరీంనగర్, భువనగిరి ఘటనలు మరువక ముందే నేడు నల్లగొండలో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 17న కరీంనగర్‌లో, ఫిబ్రవరి 22న భువనగిరిలో ఈ ఘటనలు సంభవించాయి.  నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఓ కారు అదుపుతప్పి ఏఎంఆర్పీ కాలువలో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఒకరిని స్థానికులు రక్షించారు. ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.  వేగంగా వెళ్తున్న కారు ముందు టైరు పేలడంతో.. రోడ్డు పక్కనే ఉన్న ఏఎంఆర్‌పీ లింక్‌ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు ఓర్సు రఘు, అలివేలు, కుమార్తె కీర్తి మృతి చెందారు.

 

స్థానికులు, పోలీసులు కలిసి రఘు కుమారుడిని ప్రాణాలతో కాపాడారు. క్రేన్‌ సాయంతో కాల్వలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు కూతురు ప్రాణాలు కోల్పోయిన ఘటన చూస్తుంటే అక్కడ వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు.  అప్పటి వరకు ఎంతో ఆనందంగా తమవారితో ప్రయాణం చేసిన బాలుడు తన కళ్ల ముందే చనిపోవడం చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు.  తల్లిదండ్రులు, సోదరి ఇక రారని తెలిసి బాలుడు పెడుతున్న కన్నీరు చూసి అక్కడ వారంతా ఆవేదన చెందారు.   

 

మృతులను పీఏపల్లి మండలం వడ్డెరిగూడెం వాసులుగా పోలీసులు గుర్తించారు.  ఫిబ్రవరి 17న కరీంనగర్‌లో, ఫిబ్రవరి 22న భువనగిరిలో ఇలాంటి ఘటనలే జరిగాయి.. అక్కడ కూడా అతి వేగమే కారణం అంటున్నారు పోలీసులు.  కాకపోతే ఇక్కడ ప్రమాదం మాత్రం అనుకోకుండా జరిగింది.  వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలిపోవడంతో అదుపు చేసుకోలేని పరిస్థితిలో కాల్వలోకి దూసుకు వెళ్లిందని అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో స్వస్థలం వడ్డెరిగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: