ఎంఎల్ఏలకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నుండి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రతిరోజు మధ్యాహ్నం  3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ భేటి అవ్వాలని డిసైడ్ అయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు నేతలకు అపాయిట్మెంట్ ఇవ్వటం లేదనే అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఉదయం నుండి సాయంత్రం వరకూ వివిధ శాఖల రివ్యూ సమావేశాలతోనే గడిపేస్తున్న జగన్ ప్రజా ప్రతినిధులకు, పార్టీ నేతలకు అపాయిట్మెంట్ ఇవ్వలేదన్నది వాస్తవం.

 

అసలు చాలామంది మంత్రులకు కూడా జగన్ ను కలిసి మాట్లాడటం గగనంగా మారిందనే అసంతృప్తి పెరిగిపోతోంది.  వివిధ జిల్లాల్లో ఎంపిలు, ఎంఎల్ఏల మధ్య గొడవలు పెరిగిపోవటం, మంత్రులు, ఎంఎల్ఏల మధ్య విభేదాలకు ఇది కూడా ఒక కారణం. జగన్ తో మాట్లాడటానికి అవకాశం రాకపోవటంతో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు తమ ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు. దాంతో జగన్ కు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ నేతల మధ్య గ్యాప్ పెరిగిపోయిందన్నది వాస్తవం.

 

పార్టీలో మంత్రులతో పాటు ఏస్ధాయి నేతలైనా సరే జగన్ చుట్టూ ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి లేకపోతే సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళతో మాత్రమే  మాట్లాడుకోవాల్సొస్తోంది. పోనీ వాళ్ళయినా పార్టీలోని సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళతారా అంటే అదీ అనుమానమే. దాంతో పార్టీలో సమస్యలు పెరిగిపోతున్నాయి.

 

ఈ నేపధ్యంలోనే  తొందరలో స్ధానిక సంస్ధలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో జగన్  కే ఆలోచన వచ్చిందో లేకపోతే ఎవరైనా చెప్పారో తెలీదు కానీ ఎంఎల్ఏలతో ప్రతిరోజు మాట్లాడేందుకు సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 2 గంటల పాటు ఎంతమంది ఎంఎల్ఏలు వస్తే అంతమందితోను మాట్లాడాలని డిసైడ్ చేసుకోవటం శుభపరిణామంగానే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలంటే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు నేతలతో జగన్ కు సమన్వయం అవసరం. అందుకనే ముందుగా ఎంఎల్ఏలతో భేటిలకు రెండు గంటల సమయం కేటాయించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: