రాజధాని తరలింపు  లేకపోతే మూడు రాజధానుల ఏర్పాటు విషయం కీలక మలుపు తిరిగింది.  విశాఖపట్నంకు రాజధాని తరలింపు వ్యవహారం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ ఇష్టమే అని కేంద్రప్రభుత్వం చేతులు దులుపుకుంటే కుదరదంటూ తాజాగా హై కోర్టు తేల్చి చెప్పింది. నిజానికి  కేంద్రప్రభుత్వం చెప్పినదానిలో తప్పేమీ లేదు. కాకపోతే అమరావతి ప్రాంతంలో ఏర్పాటైన రాజధానిలో కేంద్రం నిధులు కూడా ఉండటమే ఇక్కడ మెలికపడింది.

 

రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి ? అన్న విషయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోనిదే అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ మాటను హై కోర్టు అంగీకరించటం లేదు. రాజధాని ఏర్పాటులో కేంద్రం నిధులు ఇచ్చింది కాబట్టి కేంద్రజోక్యం తప్పకుండా ఉండాలని హై కోర్టు చెప్పటమే విచిత్రంగా ఉంది. నిజానికి విశాఖపట్నానికి రాజధాని తరలింపు విషయంలో కేంద్రానికి లేని అభ్యంతరాలు హై కోర్టుకు ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

చంద్రబాబునాయుడు హయాంలో ఏర్పడిన అమరావతి రాజధానికి తమ వంతు కూడా నిధులున్నాయి కాబట్టి దాని మాటేమిటి ? అని కేంద్రం అడగినా అర్ధముంది. అంతేకానీ నిధులిచ్చిన కేంద్రమే తమకు సంబంధం లేదని చెబుతుంటే మధ్యలో కోర్టుకు ఎందుకు బాధ ? రాజధాని ఏర్పాటు, అభివృద్ధి లాంటివన్నీ రాజకీయంగా జరగేవన్న విషయం అందరికీ తెలిసిందే. రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించటం వల్ల ఎదురయ్యే పరిణామాలను కేంద్ర-రాష్ట్రప్రభుత్వాలు ఎదుర్కొంటాయి. లేకపోతే పూర్తిగా రాష్ట్రప్రభుత్వానిదే బాధ్యత వహిస్తుంది.

 

ఇదే సమయంలో కర్నూలుకు హై కోర్టు తరలించాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేశారు. నిజానికి హై కోర్టు తరలింపు వ్యవహారం జగన్ చేతిలో లేదన్నది వాస్తవం. మొదటగా హై కోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్రప్రభుత్వం సిఫారసు చేస్తుంది. కానీ ఒకసారి ఏర్పాటైన హై కోర్టును మళ్ళీ ఇంకోచోటికి తరలించాలంటే మాత్రం సుప్రింకోర్టు కొలీజియం అనుమతి అవసరం.  కాబట్టి హై కోర్టు తరలింపు విషయంలో  న్యాయస్ధానం జోక్యం చేసుకుందంటే అర్ధముంది. మరి రాజధాని విషయంలో కూడా కేంద్రం జోక్యం చేసుకోవాలని హైకోర్టు ఆదేశించటమంటే ఆశ్చర్యంగా ఉంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: