ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో యజమానులు లబోదిబో అంటున్నారు. మరోవైపున రోగాలు వస్తున్నాయని కోడి మాంసం తినడానికి నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడకపోవడం తో కోడి మాంసం ధర పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్లు పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

 

ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంతుచిక్కని వైరస్ తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల ఫారాలలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో పెంపకందారులకు  కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయ్. నెల రోజులుగా వ్యాపించిన వైరస్ వల్ల జిల్లాలో చిన్న కోళ్ల ఫారాల పరిశ్రమలు మూత పడే పరిస్థితి ఏర్పడింది. ఈ వైరస్ పంజాబ్ నుండి ఆంధ్రప్రదేశ్ లోని కోళ్ల ఫారాలకు వ్యాపించాయని, అక్కడ నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోని జిల్లాలకు పాకినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

 

అంతుచిక్కని వైరస్ వల్ల ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే లక్షకు పైగా కోళ్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది. పెనుబల్లి మండలంలో గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్ల ఫారంలో.. 15 రోజుల్లో వ్యవధిలోనే 70 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కోటి 50 లక్షలు నష్టపోయామని, భీమా కూడా వర్తించక పోవడం వల్ల తమకు కోలుకోలేని దెబ్బని వాపోతున్నారు కోళ్లఫారం యజమానులు.

  

5 వేల నుండి 15 వేల కెపాసిటీ ఉన్న కోళ్ల ఫారాలు ఈ వైరస్ వల్ల తుడిచి పెట్టుకుపోయాయి. బాయిలర్ కోళ్లను కంపెనీ ల ద్వారా పెంచే చిన్న చిన్న ఫారాల పెంపకం దారులు కష్టాల్లో కూరుకుపోయారు.  చనిపోయిన కోళ్ల ను ఫారాలలోనే వదిలేసి వెళ్లిపోవడంతో ఆ వాసనకి గ్రామాలలో స్థానికులు,  అధికారులకి పిర్యాదులు చేస్తున్నారు. గుడ్లు పెట్టే కోళ్లు ఒక్కోటి తయారు అవ్వడానికి 200 - 220 ఖర్చు అవుతుందని, చిన్న బాయిలర్ కోళ్లు తయారు అవ్వడానికి 170 - 190 రూపాయల ఖర్చు అవుతుందని యజమానులు చెబుతున్నారు.  

 

చిక్ సీడ్ తయారు చేస్తున్న కంపెనీల ప్రతినిధులు విజయవాడ , హైదరాబాద్ లోని ల్యాబ్ లకు తీసుకువెళ్లి టెస్టులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. వైరస్ ను అరికట్టే వాక్సిన్ ను కనిపెట్టలేక పోతున్నారు. వైరస్ వల్ల గత నెల రోజుల నుండి ఆంధ్రాలో చిక్ సీడ్ సప్లై ని నిలిపివేసి చిక్ హాలిడే ప్రకటించారు. దాంతో కోళ్ల ఫారాలు మూతపడగా,  తెలంగాణలో సైతం సీడ్ సరఫరా నిలిపివేశారు. ఈ వైరస్ పై  అధికారులకు నివేదిక ఇస్తామని చెప్పుకొచ్చారు.

 

సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి, సిద్ధారం, నారాయణపురం, లింగపాలెం, గ్రామాలలో పెనుబల్లి మండలంలో నాయకులగూడెం, కొత్త పాత కారాయి గూడెం, అడవిమల్లెల, బయ్యన్నగూడెం, వి ఎం బంజరు, గ్రామాలలో కల్లూరు,  తల్లాడ మండాల్లో సైతం కోళ్లఫారాలు ఈ వైరస్ తో మూతపడే పరిస్థితి ఏర్పడింది.  

 

వైరస్ తో కోళ్లు పెద్ద ఎత్తున చనిపోవడంతో జనం కోడిమాంసాన్ని తినేందుకు జంకుతున్నారు. వారం రోజుల క్రితం వరకు కిలో చికెన్ 200  పలుకగా, ఇప్పుడేమో వంద రూపాయలకి పడిపోయింది.  వైరస్ తో చనిపోయిన కోళ్ల ను కాల్చివేసి పూడ్చాలని తెలిపారు పశువైద్య అధికారులు ఫారాల నిర్వాహకులకు సూచిస్తున్నారు.ఈ వైరస్ కోళ్ల ఫారాల్లోనే కాకుండా గ్రామాలలో నాటు కోళ్ల కు సైతం వ్యాపించి చనిపోతున్నాయని గ్రామస్థులు మొత్తుకుంటున్నారు. పశు సంవర్ధక అధికారులు జోక్యం చేసుకోని.. జిల్లాలో పరిస్థితిని చక్కదిద్దాలని కోళ్ల ఫారాల యజమానులు, పెంపకందారులు వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: