చంద్రబాబు విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన్ను విమానాశ్రయం వద్దే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు ప్రతిపక్ష నేత పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు మైలేజీ కోసం కావాలనే డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

 

 

ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో చంద్రబాబు అనుసరించిన తీరుపై ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఆమె ఏమన్నారంటే.. " ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారన్నారు రోజా.

 

 

ఇటీవల రాజధాని ప్రాంతంలో లేని గ్రామాల్లో చంద్రబాబు తన సామాజిక వర్గం నేతలతో ఎలా అడ్డగించారో చూశాం. దళిత ఎంపీ సురేష్‌పై టీడీపీ గుండాలు రైతుల ముసుగులో దాడులు చేశారు. విశాఖలో మాత్రం ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చూస్తున్నారు. అమరావతిలో ప్రీ ప్లాన్డ్‌ పెయిడ్‌ అర్టిస్టులతో ఉద్యమం చేస్తున్నారు.

 

 

కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమకు చంద్రబాబు వస్తే ప్రజలే స్వచ్ఛందంగా తరిమి కొడతారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఇందుకు తాజాగా విశాఖ ఉదంతమే ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. శాంతిభద్రతలకు సహకరించాలని పోలీసులు కోరితే చంద్రబాబు వాగ్వాదానికి దిగడం ఆయన నీచ రాజకీయాలకు తార్కాణమని రోజా కామెంట్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: