ఒకే ఒక ఘోర ఓటమి ఏపీలో టీడీపీ భవిష్యత్‌నే ప్రశ్నార్ధకంలో నెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీలో ఉంటే తమ భవిష్యత్ ఏం అవుతుందనే బెంగతో చాలామంది నాయకులు తమ దారి తాము చూసుకున్నారు. కొందరు బీజేపీలోకి వెళితే, మరికొందరు వైసీపీలోకి వెళ్లారు. ఇప్పటికీ వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీలో కీలకంగా ఎదిగి, తూర్పు గోదావరి రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు కూడా బాబుకు గుడ్ బై చెప్పారు.

 

జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే బాబుతో కష్టమని భావించి వైసీపీ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి ఈయన ఎన్నికల ముందే వైసీపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తనతో పాటు తన కుమారుడుకు కూడా సీటు ఇస్తే పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ జగన్ తోటకు ఒక్కరికే సీటు ఇస్తానని చెప్పడంతో, పార్టీ మార్పుకు బ్రేక్ పడింది. దీంతో తోట తప్పక మళ్ళీ టీడీపీ నుంచే పోటీ చేశారు. రామచంద్రాపురం బరిలో దిగి చెల్లుబోయిన వేణుగోపాల్ చేతిలో ఓడిపోయారు.

 

ఓడిపోయాక టీడీపీతో లాభం లేదనుకుని ఎలాగోలా వైసీపీలోకి వచ్చేశారు. తోట వైసీపీలోకి వెళ్లడమే రామచంద్రాపురంలో టీడీపీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. పైగా ఇటీవల కొన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లని నియమించిన చంద్రబాబు, రామచంద్రాపురంలో మాత్రం నియమించలేదు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల సమరం వస్తుండటంతో అక్కడి టీడీపీ కేడర్ దిక్కులు చూస్తుంది. అయితే 2009లో పోటీ చేసి ఓడిపోయిన గుత్తుల శ్రీ సూర్యనారాయణ బాబు ఇప్పుడు ఏమైపోయారో తెలియదు.

 

ఈయనకు 2014లో టికెట్ దక్కకపోవడంతో అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు కూడా కొత్తగా ఇన్‌చార్జ్‌ని నియమించకపోవడంతో రామచంద్రాపురం టీడీపీ కేడర్ దిక్కులేక వైసీపీలోకి వెళ్లిపోతుంది. అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే వైసీపీలోకి వెళ్ళిన తోట పరిస్తితి కూడా ఏం బాగోలేదు. ఆయనకు సొంత పార్టీ నుండే నిరసనలు ఎదురవుతున్నాయి. పైగా ఆయనకు భవిష్యత్‌లో వైసీపీ టికెట్ ఇచ్చే పరిస్తితి లేదని తెలుస్తోంది. మరి చూడాలి భవిష్యత్‌లో రామచంద్రాపురంలో ఊహించని మార్పులు ఏమన్నా జరుగుతాయేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: