ఏపీలో అధికార వైసీపీపై ప్ర‌తిప‌క్ష టీడీపీ నాయకులు విమర్శల జోరు పెంచారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి 9 నెల‌లు కూడా కాకుండానే చంద్ర‌బాబు అప్పుడే ప్ర‌జాచైత‌న్య యాత్ర‌లు అంటూ జ‌నాల్లోకి వెళ్లిపోతున్నారు. త‌మ పార్టీ కేడ‌ర్‌ను కూడా ఏకంగా 45 రోజుల పాటు జ‌నాల్లోనే ఉండాల‌ని సీరియ‌స్‌గా ఆదేశాలు జారీ చేశారు. వీరిలో కొంద‌రు ఇప్ప‌టికే సీరియ‌స్‌గా జ‌నాల్లోకి వెళుతుంటే మ‌రి కొంద‌రు నేత‌లు మాత్రం బాబు మాట‌ల‌ను చాలా చాలా లైట్ తీస్కొంటున్నారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించి రాజధాని ప్రాంతమంతా విశాఖపట్టణానికి తరలించాలని నిర్ణయించడంపై టీడీపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది.



ఇక ఈ మూడు రాజ‌ధానుల విష‌యంలో రాజ‌ధాని ప్రాంతంలో జ‌రుగుతోన్న ఆందోళ‌న‌ల‌కు టీడీపీ ముందు నుంచి మ‌ద్ద‌తు ఇస్తోంది. ఇక అక్కడ ఎన్ని ఆందోళ‌న‌లు జ‌రిగినా సీఎం జ‌గ‌న్ మాత్రం ఎంత మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అక్క‌డ 71 రోజులుగా ఆందోళ‌న‌లు బ్రేక్ లేకుండా జ‌రుగుతోన్న నేప‌థ్యంలో టీడీపీ స‌రికొత్త అస్త్రంతో జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌జ‌లంద‌రూ వ్య‌తిరేకిస్తున్నార‌ని నిరూపించేందుకు అక్క‌డ ప్రజా బ్యాలెట్ నిర్వ‌హిస్తున్నారు.



ప్ర‌జా బ్యాలెట్ ద్వారా మూడు రాజ‌ధానుల‌కు ప్ర‌జ‌లంద‌రూ వ్య‌తిరేకం అని నిరూపిస్తామ‌ని టీడీపీ నాయకులు మాజీమంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఈ విషయం వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ ప్ర‌జా బ్యాలెట్ నిర్వ‌హిస్తున్న‌ట్టు వాళ్లు చెప్పారు. చంద్ర‌బాబు చేప‌ట్టిన ప్ర‌జా చైత‌న్య యాత్ర పూర్తి అయ్యేలోగా ఈ ప్ర‌జా బ్యాలెట్ ను కూడా కంప్లీట్ చేస్తామ‌ని వాళ్లు చెప్పారు. మ‌రి ఈ ప్ర‌జా బ్యాలెట్‌లో ఎలాంటి తీర్పు వ‌స్తుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.



అయితే వైసీపీ వాళ్లు మాత్రం వైసీపీ గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఈ యాత్ర చేయాల‌ని స‌వాల్ విసురుతున్నారు. ఈ బ్యాలెట్ ఓటింగ్ అనేది కేవ‌లం   రాజధాని ప్రాంతంలోనే కాకుండా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా చేస్తే వాస్తవమేమిటో తెలుస్తుందని వారు అంటున్నారు. మ‌రి దీంట్లో అయినా బాబు స‌క్సెస్ అవుతాడా ?  లేదా బాబోరి ఖాతాలో మ‌రో ప్లాప్ షో ప‌డుతుందా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: