ఒక్కోసారి మ‌నుషులను చూస్తుంటే...వీళ్లు మ‌నుషులేనా అనే భావ‌న క‌లుగుతుంది. ఎందుకు ఇలాంటి బ‌తుకులు బ్ర‌తుకుతారు? అనే అస‌హ్యం వేస్తుంది. అలాంటి అస‌హ్యం వేసే ఘ‌ట‌నే తాజాగా జ‌రిగింది. హైద‌రాబాద్‌ ప‌టాన్‌చెరు స‌మీపంలో వెలిమెల నారాయణ కళశాలలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో దారుణం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. శ్రీధర్ అనే ఓ కానిస్టేబుల్‌ విద్యార్థిని తండ్రి పట్ల అమానుషంగా ప్రవర్తించి, అతనిని బూటు కాలితో తన్నిన తీరు చూస్తుంటే...ఇంత రాక్ష‌సంగా ఎలా ఉంటారు అనే సందేహం రాక‌మాన‌దు. అయితే, ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ప‌రువు గంగ‌పాల‌యింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. కానీ ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీరియ‌స్‌గా స్పందించారు.

 

 

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నారాయ‌ణ‌ ఇంటర్‌ కాలేజీలో  మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం ఎనుగొండకు చెందిన చంద్రశేఖర్‌ తన పెద్దకుమార్తె సంధ్యారాణి(16) ఇంట‌ర్ చ‌దువుతోంది. సంధ్యారాణి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. యాజమాన్యం తమకు తెలిసి, వైద్యం పేరిట మాత్రలను ఇచ్చినా జ్వరం తగ్గలేదు. ఈ విషయాన్ని సంధ్యా ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు తెలిపింది. వారు కలిసేందుకు వస్తామని సంధ్యకు తెలపగా మీరు వచ్చినా యాజమాన్యం అనుమతించరని చెప్తూ... శనివారం రావాల‌ని ఇంట్లో వారికి తెలిపింది. అయితే, ఊహించ‌ని రీతిలోమంగళవారం మధ్యాహ్నం సంధ్యారాణి బాత్‌రూంలోకి వెళ్లి గీజర్‌ పైపుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతూ సంధ్యారాణిని నల్లగండ్లలోని ప్రవేటు ఆసుపత్రికి కాలేజీ యాజమాన్యం తరలించింది. అయితే, ఆమె అప్పటికే మరణించింది. ఈ విష‌యంలో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. 

 


పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సంధ్యారాణి మృతదేహాన్ని సిటిజన్‌ హాస్పిటల్‌నుంచి పటాన్‌చెరు ఏరియా దవాఖానకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి బాధిత కుటుంబసభ్యులతో కలిసి మృతదేహాన్ని కళాశాల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీస్‌ సిబ్బంది అడ్డుకొన్నారు. ఈ సమయంలోనే తండ్రి చంద్రశేఖర్‌ను కానిస్టేబుల్ శ్రీధర్ బూటు కాలితో తన్నాడు. కానిస్టేబుల్ రాక్ష‌స ప్ర‌వ‌ర్తన నెట్టింట వైర‌ల్ అయింది. ఓ వ్య‌క్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.  ‘ప్రజలు దుఃఖ సమయాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు సానుభూతి చూపించాలి’ అని ట్వీట్‌చేశారు. ఈ విషయంపై హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి దృష్టి సారించి, పోలీసుల ప్రవర్తనపై సమీక్షించాలని కోరారు. 
మంత్రిగారు స్పందించిన త‌ర్వాత ఇటు పోలీసులు, అటు హోం మంత్రి సీరియ‌స్ అయ్యారు. దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌ శ్రీధర్‌ను సంగారెడ్డి ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని డీజీపీ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: