సాధారణంగా మనదేశంలో కుక్కలను ఇంటిముందు కాపలాగా ఉంచుకుంటాము. కానీ.. కొందరు మాత్రం వాటిని చాలా గారాబంగా చూసుకుంటారు. కొందరయితే.. వాటికి పనులు చెప్పడం.. పాల ప్యాకెట్ తీసుకురా అనటం.. ఇలాంటివి ఇక్కడ అరుదేమో కానీ విదేశాల్లో మాత్రం సర్వసాధారణం. ఇక శునకాలకు ఈ మేరకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక సంస్థలు కూడా ఉంటాయి. అలా అమెరికాలోని కెంటకీలో ‘డబుల్ హెచ్ కెనైన్’ అనే ట్రైనింగ్ అకాడమీ ఉంది. ఇది కుక్కలకు రకరకాల పనులను నేర్పించే శిక్షణ సంస్థ.
ఇందులో రైకర్ అనే శునకం శిక్షణకు వచ్చింది. దానికి పనులు చేయాలన్న ఆరాటమే కానీ ఏ ఒక్కటీ సరిగ్గా చేయలేకపోయింది. పైగా ప్రయత్నించే క్రమంలో అది చేస్తున్న పనులు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఫ్రిజ్ డోర్ తెరవమంటే ఏకంగా ఫ్రిజ్ నే లాక్కు రావడం, విసిరేసిన బంతి పట్టుకురమ్మంటే అది పరిగెత్తే క్రమంలో యజమానిని కింద పడేయడం లాంటివి చేస్తూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. జెర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకానికి శిక్షణ ఇస్తున్న వీడియోను ట్రైనింగ్ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
ఒకరకంగా కుక్కకు ట్రైనింగ్ ఇవ్వడానికి వారి తల ప్రాణం తోక్కొచ్చిందనుకోండి. కానీ గమ్మత్తైన విషయమేంటంటే మరో వీడియోలో ఈ రైకర్ అలవోకగా అన్ని పనులు చేస్తూ వావ్ అనిపించుకుంది. తన సాయశక్తులా కష్టపడి ఎట్టకేలకు అన్ని విద్యల్లో ఆరితేరిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కుక్కలకు ట్రైనింగ్ ఏంటి అని అనుకుంటున్నారా.?? శునకాలకు ఇచ్చే శిక్షణలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. గైడ్ డాగ్స్: దృష్టి లోపం ఉన్న వాళ్లకు, అంధులకు సహాయపడే విధంగా శునకాలకు శిక్షణ నిస్తారు. హియరింగ్ డాగ్స్: వినికిడి సమస్య ఉన్నవాళ్లకు సహాయపడేలా శిక్షణ నిస్తారు. సర్వీస్ డాగ్స్: పైన వాటిలా ప్రత్యేకంగా ఒక పనికి కాకుండా రకరకాల పనులకు ఉపయోగపడేలా శునకాలకు శిక్షణ నిస్తారు. వీటితో పాటు మెడికల్ అలర్ట్ డాగ్స్, సైకియాట్రిక్ సర్వీస్ డాగ్స్... పేరుతో శునకాలకు శిక్షణ నిస్తారు.