టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విశాఖ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. చంద్రబాబును ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 151 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భద్రత దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబును ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు ఆ నోటీసుల్లో తెలిపారు. చంద్రబాబును విమానశ్రం వీఐపీ లాంజ్‌ లోకి తీసుకెళ్లారు.. అక్కడే అరగంట పాటు వీఐపీ లాంజ్‌ లో ఉంచడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

 

 

కాగా., మరో వైపు ఉదయం నుంచి ఎయిర్‌ పోర్ట్‌ లోనే చంద్రబాబు నిలిచిపోయారు. తర్వాత తన కారులో నుంచి దిగి రోడ్డు పై ఆయన బైఠాయించారు.. ఆయన పోలీసుల తీరు పై మండిపడ్డారు. పోలీసులు మాజీ ముఖ్యమంత్రి యాత్రకు అనుమతి ఇచ్చినా.. వైఎస్సార్‌ సీపీ మాత్రం చాలా దుర్మార్గంగా తన యాత్రను అడ్డుకుంటోందని చంద్రబాబు అన్నారు. 

 

 

అధికారంలో ఉన్న వైఎస్సార్‌ సీపీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అధికారంలో ఉన్నారు కదా అని ఏది చెప్తే అది చేస్తున్నారని, ఎయిర్‌ పోర్టు ముందు వైసీపీ గూండాలు గుమి కూడితే.. ఏమీ చేయలేక పోలీసులు చేతులెత్తేస్తారా అంటూ చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు.

 

 

అసలు ఏపీలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఈ ఘటన చూస్తూనే అర్థమవుతోందని.. ప్రతిపక్ష నేతగా ఉన్న తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుడి పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా.. పోలీసులు ఏం సమాధానం చెబుతారన్నారు. వైఎస్సార్‌ సీపీ నేతలు డబ్బులిచ్చి మనుషుల్ని తీసుకొచ్చి.. తమ పై కోడిగుడ్లు, చెప్పులు, రాళ్లు వేశారని మండిపడ్డారు. విశాఖ ప్రశాంతమైన నగరమని.. కానీ వైఎస్సార్‌ సీపీ నేతలు ఆ ప్రశాంతతను పొగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: