గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ కోసం సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కు ఏపీ ప్రభుత్వం విశేషాధికారాలు కల్పించింది. మరి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏయే అంశాలను విచారించబోతోంది..? ఎవరెవరిని ప్రశ్నించబోతోంది అనేది  ఆసక్తికరంగా మారింది. సిట్ విషయంలో ఏపీ సర్కార్ దూకుడు చూస్తుంటే మాజీ సీఎం చంద్రబాబును విచారించే సూచనలు కన్పిస్తున్నాయనే చర్చ అధికార పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

 

ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ విచారణ తీరుపై  సర్వత్రా చర్చ జరుగుతోంది.  ఇప్పటికే సిట్‌కు ప్రభుత్వం విశేషాధికారాలు కల్పించింది. సిట్‌నే పోలీస్ స్టేషన్‌గా పరిగణించాలని, సిట్ విచారణ పరిధిలోకి రాష్ట్రం మొత్తాన్ని తీసుకువచ్చింది. దీంతో సిట్ ఎవరెవరిని విచారిస్తుంది? ఏయే అంశాలను టార్గెట్ గా చేసుకొని విచారణ చేపట్టబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

 

సీఆర్డీఏ పరిధిలోని అక్రమాలకు సంబంధించి ఇప్పటికే సీఐడీ విచారణ జరుగుతోంది. మాజీ మంత్రులైన పత్తిపాటి పుల్లారావు, నారాయణ వంటి వారిపై కేసులు నమోదు చేసింది. దీనికి సంబంధించి మరింత లోతుగా విచారణ జరపాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకొన్ని అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపట్టడంతోపాటు.. కొందరిని ప్రశ్నించే దిశగా కూడా సిట్ చర్యలు తీసుకోబోతోన్నట్టు సమాచారం. ఈ మేరకు సీఆర్డీఏ విషయంలో కొందరు మాజీ మంత్రులను సిట్ ప్రశ్నించబోతోందా..? అనే చర్చ జరుగుతోంది.

 

ఇక సెకండ్ ప్రయారిటీ కింద ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. దీంతో అందుకు సంబంధించిన అక్రమాలపై తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ దృష్టికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్నికల సమయంలో ఆయన దేవినేని ఉమపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై సీబీఐ విచారణ కూడా కోరారు. ఇప్పుడు ఇదే అంశంపై సిట్‌ విచారణ జరుపుతుండటంతో తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తానంటున్నారు ఎమ్మెల్యే....
మాజీ సీఎం చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేష్ టార్గెట్ గానే సిట్ ఏర్పాటు అయిందని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.  కొన్ని అంశాలకు సంబంధించి అవసరమైతే వారిద్దరిని ప్రశ్నించాలని సిట్ భావిస్తే విచారణకు పిలిచే అవకాశం ఉందంటున్నారు.  ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా మరింత దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: