నోట్ల రద్దు తర్వాత ప్రజల ముందుకు వచ్చిన రెండు వేల రూపాయల నోటు ఇకపై కనిపించదా.. ఈ విషయంపై ఇప్పటికే ‌ప్రజల్లో అనుమానాలు వచ్చాయి. వాటికి తగ్గట్టుగానే బ్యాంకులు కూడా ఈ నోట్లు ప్రజలకు ఇవ్వడంలేదు. ఏటీఎం మెషీన్లలోనూ ఈ నోట్లు రావడం లేదు. దీంతో ఇక రెండు వేల రూపాయల నోటు పనైపోయిందని అంతా అనుకుంటున్నారు.

 

ఇప్పుడు తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. దేశంలో రెండువేల రూపాయల నోట్లను తొలగిస్తారని వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తాము బ్యాంకులకు రెండువేల రూపాయల నోట్లను నిలిపివేయాలని ఎక్కడా ఆదేశించలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.

 

ఆమె ఇంకా ఏమన్నారంటే.. తనకు తెలిసినంతవరకు, బ్యాంకులకు అలాంటి సూచనలేమీ ఇవ్వలేదంటూ తాజా వదంతులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసి పుచ్చారు. 2 వేల రూపాయల విలువైన నోట్లు చట్టబద్ధంగా చలామణిలో వుంటాయని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

 

అయితే గతంలో పలువురు ఆర్థిక వేత్తలు, బ్యాంకింగ్ నిఫుణులు ఈనోటు ఇక కనిపించకపోవచ్చని అన్నారు. ఈ రద్దు ఆనాటి నోట్ల రద్దులాగా ఒకేసారి దేశంలో విధించబోరని.. క్రమంగా 2 వేల రూపాయల నోటును బ్యాంకులకు పరిమితం చేస్తారని అన్నారు. ప్రస్తుతం దేశంలో చెలామణీలో వున్న కరెన్సీలో 2 వేల రూపాయల నోటు వాటా దాదాపు మూడో వంతు వుంటుంది. ఉదాహరణకు దేశంలో చెలామణీలో వున్న నగదు మొత్తం 24 లక్షల కోట్లు అనుకుంటే అందులో 8 లక్షల కోట్లు 2 వేల రూపాయల నోట్లే.

 

అందులోనూ నల్లధనం ఉన్నవారు.. ఈ నోట్లను పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటున్నారన్న వాదన ఉంది. క్రమంగా 2 వేల రూపాయల నోటు నల్లధనం దాచుకునే వారికి ఉపయోగకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే 2 వేల రూపాయల నోటును క్రమంగా బ్యాంకులకే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అదేమీ లేదంటున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

మరింత సమాచారం తెలుసుకోండి: