అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ టూర్ భార‌త్‌లో ఎంత ఆస‌క్తిని రేకెత్తించిందో అమెరికాలో సైతం అదే రీతిలో క్రేజ్‌ను పుట్టించింది. ఆయ‌న టూర్ గురించి దేశంలో బీజేపీ త‌మ వాద‌న వినిపించిగా విపోఆలు విరుచుకుప‌డ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా అమెరికాలో ట్రంప్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు సైతం ఆస‌క్తికర కామెంట్లు చేశారు. అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున‌ రేసులో ఉన్న బెర్నీ సాండ‌ర్స్‌..  ట్రంప్ భార‌త ప‌ర్య‌ట‌నపై కామెంట్ చేశారు. ఢిల్లీలో జ‌రిగిన అల్ల‌ర్ల గురించి అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ స‌రైన రీతిలో స్పందించ‌లేద‌ని బెర్నీ సాండ‌ర్స్ అన్నారు.   

 

ట్రంప్ త‌న రెండో రోజు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ భార‌త అంత‌ర్గ‌త అంశ‌మ‌ని, దాని గురించి ప్ర‌ధాని మోదీతో చ‌ర్చించ‌లేద‌ని వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సాండ‌ర్స్ స్పందిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌ను నాయ‌క‌త్వ వైఫ‌ల్యంగా పోల్చారు. మాన‌వ‌హ‌క్కుల అంశంపై ట్రంప్ స‌రైన రీతిలో రియాక్ట్ కాలేద‌న్నారు. భార‌త్‌లో సుమారు 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నార‌ని, ఢిల్లీ అల్ల‌ర్ల‌లో 27 మంది చ‌నిపోయార‌ని, దానిపై ట్రంప్ చేసిన కామెంట్‌.. ఆయ‌న నాయ‌క‌త్వ వైఫ‌ల్యాన్ని చూపుతున్న‌ద‌ని సాండ‌ర్స్ ఆరోపించారు. కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన సీఏఏను ప‌లువురు డెమోక్రాట్లు కూడా తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. దేశంలో చెల‌రేగుతున్న హింస‌కు ఆ చ‌ట్ట‌మే కార‌ణ‌మ‌న్నారు.

 

కాగా, ట్రంప్‌,మోదీ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రస్తావనే రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శృంగ్లా తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్‌, మోదీ ఐదుగంటలకుపైగా చర్చలు జరిపారన్నారు. ఈ సందర్భంగా మత స్వేచ్ఛ అంశంపై ఇద్దరు నేతలు సానుకూల వాతావరణంలో మాట్లాడుకున్నారని చెప్పారు. ట్రంప్‌, మోదీ మధ్య పాకిస్థాన్‌ అంశం చర్చకు వచ్చిందని, ఈ సందర్భంగా సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళనలను మోదీ ప్రస్తావించారన్నారు. ‘బహుళత్వం, వైవిధ్యం’ అనేవి రెండు దేశాలను కలిపి ఉంచుతున్న అంశాలని పేర్కొంటూ ఒకరినొకరు అభినందించుకున్నారని వెల్లడించారు. భారత్‌, అమెరికా మధ్య ప్రధానంగా భద్రత, రక్షణ, శక్తి, టెక్నాలజీ, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలపై చర్చ జరిగిందన్నారు. రక్షణ రంగంలో భారత్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ట్రంప్‌ చెప్పారన్నారు. వాణిజ్య పరంగా త్వరలో భారీ ఒప్పందం కుదుర్చుకోవాలని మోదీ, ట్రంప్‌ నిర్ణయించారన్నారు. పరస్పర సహకారానికి సంబంధించి ఇంధన రంగం ప్రాధాన్య అంశంగా మారిందని, ఈ ఏడాది అమెరికా నుంచి 900 కోట్ల డాలర్ల (దాదాపు రూ.64.7 వేల కోట్లు) పెట్టుబడులు ఆశిస్తున్నామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: