దేశ‌వ్యాప్తంగా వివాదాస్ప‌దంగా మారిన  జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) విష‌యంలో అనేక ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నా ఈ విష‌యంలో కేంద్రం దూకుడుగానే ముందుకు సాగుతోంది. జనగణనతోపాటే ఎన్పీఆర్‌ డేటాను అప్‌డేట్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30లోగా జనాభా లెక్కల సేకరణను పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ వ్యవధిలోనే రాష్ట్రాలులు వరుసగా 45 రోజులను ఎంపికచేసుకొని జనగణన పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ అధికారులు త‌గు ప్ర‌క్రియ‌ల‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ నిర్ణ‌యాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ర్కారు త‌ప్పుప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

 


జనగణన, ఎన్పీఆర్‌ వివరాలను ఎన్యూమరేటర్లు మొబైల్‌ ద్వారా సేకరించే విధంగా కేంద్ర సెన్సస్‌ విభాగం ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనికి సంబంధించిన సర్వర్‌ ఢిల్లీలో ఉంటుంది. జనగణన కోసం 31 రకాల ప్రశ్నావళి ఉండగా, ఎన్పీఆర్‌కు 23 ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నావళిని కేంద్రం త్వరలో విడుదల చేయనుంది. ఎన్యూమరేటర్లు జనాభా లెక్కలు, ఎన్పీఆర్‌ డేటా వివరాలను వేర్వేరుగా నమోదు చేయనున్నారు. ఈ రెండింటికి వేర్వేరుగా ఫారాలు ఉంటాయి. ఆ ఫారాలలోని వివరాలను న్యూమరేటర్లు కుటుంబ పెద్దను అడిగి నమోదుచేయాల్సి ఉంటుంది. జనగణన, ఎన్పీఆర్‌ వివరాలను యాప్‌లోని వేర్వేరు ఫారాలలో నమోదు చేసిన తరువాత ఎన్యూమరేటర్లు వాటిని సర్వర్‌కు అప్‌లోడ్‌ చేస్తారు. అప్‌లోడ్‌ అయిన వివరాలు సదరు మొబైల్‌ఫోన్‌ నుంచి తొలిగిపోతాయి. దీంతో ఇతరులు వాటిని చూసే లేదా మార్చే అవకాశం ఉండదు. యాప్‌లో కాకుండా ఫారాలపై వివరాలు సేకరించే ఎన్యూమరేటర్లు వాటిని స్థానిక తాసిల్దార్‌కు అప్పగించాల్సి ఉంటుంది.

 

 

మ‌రోవైపు, జ‌నాభా లెక్కల సేకరణ, ఎన్పీఆర్‌ కోసం జనగణన విభాగం అన్ని జిల్లాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారులను నియమించింది. జిల్లాలకు కలెక్టర్లు, కార్పొరేషన్లకు కమిషనర్లు ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. డివిజన్‌ స్థాయిలో ఆర్డీవోలు, మండలాలలో తాసిల్దార్లు ఆ బాధ్యతను నిర్వహిస్తారు. ఇదిలాఉండగా, జనగణన విభాగం రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తిచేసింది. జిల్లాస్థాయిలో శిక్షణ కొనసాగుతున్నట్టు తెలిసింది. అనంతరం క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి సెలవుల సమయంలోనే జనగణన చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: