తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న కీల‌క నిర్ణ‌యం త్వ‌ర‌లో అమ‌లులోకి రానుంది. పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ప్రభుత్వ దవాఖానల్లో అందించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లోనూ దవాఖానలను అప్‌గ్రేడ్‌చేయడమే కాకుండా వ్యాధినిర్ధారణ పరీక్షలు సైతం నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణ‌యం ఓ కొలిక్కి వ‌చ్చింది. రాజధాని హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి డయాగ్నస్టిక్‌ హబ్‌ను ప్రారంభించిన ప్రభుత్వం.. జిల్లాలకు సైతం ఈ సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రస్తుతానికి 20 చోట్ల డయాగ్నస్టిక్‌ హబ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు.

 


ప్ర‌జ‌ల‌కు వైద్య ప‌రీక్ష‌ల ఖ‌ర్చులు త‌గ్గించేందుకు గ‌తంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. డ‌య‌గ్నోస్టిక్ హ‌బ్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమకు దగ్గర్లో ఉన్న ఆస్ప‌త్రులో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే వాటి శాంపిళ్లను సంబంధిత డయాగ్నస్టిక్‌ హబ్‌కు పంపించి సత్వరమే ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పల్లె ప్రజలు పట్టణాలకు వచ్చే శ్రమ తగ్గిపోతుంది. ఈ డయాగ్నస్టిక్ హబ్‌లలో మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి  సీజనల్‌ వ్యాధులతోపాటు వీడీఆర్‌ఎల్‌, హెమటాలజీ, బ్లడ్‌గ్రూపింగ్‌, ప్లేట్‌లెట్స్‌, హార్మోన్‌ స్టడీస్‌, మేజర్‌, మైనర్‌ సర్జికల్‌ ప్రొఫైల్‌, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఐజీ, హెచ్‌సీవీ, విటమిన్‌ బీ 12, డీ విటమిన్‌, షుగర్‌, కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు,  థైరాయిడ్‌, ఫీవర్‌, టీబీ, క్యాల్షియం వంటి అనేక పరీక్షలను నిర్వహిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖానలు, జిల్లాస్థాయి హాస్పిటళ్లలో వీటిని ఏర్పాటు చేసేందుకు వైద్యశాఖాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

 


ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ఏరియా, జిల్లా స్థాయి ఆస్ప‌త్రుల‌ను అనుసంధానిస్తూ ప్రస్తుతానికి 20చోట్ల డయాగ్నస్టిక్‌ హబ్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం కరీంనగర్‌, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల, వికారాబాద్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, ములుగు, మహబూబాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెం, జగిత్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్స్‌ హబ్‌లను దశలవారీగా అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాదిలోనే వీటిని అందుబాటులోకి తేనున్న‌ట్లు స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: