`హైద‌రాబాద్ న‌గ‌రంలోని వివిధ జంక్షన్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రధాన రోడ్లపై యాచకులను నాలుగైదు రోజులపాటు గమనించి మార్చి రెండో వారంలో వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. నిత్యం స్మార్ట్‌ఫోన్లు చూస్తూ.. ఉండకుండా.. కాస్త పనిపై కూడా దృష్టి పెట్టండి. వాహనంలో వెళ్తున్నప్పుడు పరిసరాలను పరిశీలించండి. రోడ్లపై గుంతలు, వెలగని లైట్లు, డ్రైనేజీ లీకేజీ, చెత్తకుప్పలు ఉంటే స్పందించండి’.. ఈ మాట‌లు ఎవ‌రిని ఉద్దేశించి ఎవ‌రు అన్నారో తెలుసా? హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సందర్భంగా అధికారులను ఉద్దేశించి కమిషనర్‌ లోకేశ్‌కుమార్ త‌న అధికారుల‌ను ఉద్దేశించి అన్నారు. 

 


హైద‌రాబాద్‌లో యాచక వృత్తిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్న నేప‌థ్యంలో దీనిపై అధికారులతో క‌మిష‌న‌ర్ దీర్ఘంగా చ‌ర్చించారు. సర్కిల్‌, జోనల్‌ స్థాయిలో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతమున్న నైట్‌ షెల్టర్లలో తాత్కాలికంగా 24 గంటలపాటు భోజన వసతితో పాటు వినోదం కోసం టీవీ, దినపత్రికలను అందుబాటులో ఉంచాలన్నారు. అనాథలు, వృద్ధుల ఆశ్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల పనితీరును గమనించి ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్న ఏజెన్సీలకు యాచకుల పునరావాస కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు కమిషనర్‌ తెలిపారు.

 


ఇక న‌గ‌రంలోని వివిధ అంశాల‌ను చ‌ర్చిస్తూ, ప్రస్తుతం 122 బస్తీ దవాఖానలు కొనసాగుతుండగా, 40 వాటికి మౌలిక వసతులు సిద్ధం చేసినట్లు తెలిపారు. మరో 54చోట్ల వసతుల  ప్రక్రియ కొనసాగుతుండగా, మిగిలిన 83 దవాఖానల ఏర్పాటుకు స్థలాలను గుర్తించామన్నారు. జోన్‌కు 500చొప్పున కొత్తగా 3000 టాయిలెట్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. గుర్తించిన 185 చెరువులను పరిరక్షించేందుకు నీటి నిల్వ సామర్థ్యం మేరకు ఫెన్సింగ్‌ చేయించాలని కమిషనర్‌ ఆదేశించారు. 344 నాలాల్లో 50 నాలాల పూడికతీత పనులు ప్రారంభించినట్లు, తొలగించిన పూడికను అదేరోజు తరలించాలన్నారు. సుమారు 1000 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లపై ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, వ్యాపార సంస్థల ముందు తప్పనిసరిగా రెండు చెత్తకుండీలను ఏర్పాటు చేయించాలని అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: