చంద్రబాబు విశాఖ టూర్ లో ఎన్నో చిత్రాలు జరిగిపోయాయి. ఓ వైపు పార్టీని చక్కదిద్దుకుందామని బాబు ప్రజా చైతన్య యాత్ర చేపడితే మరో వైపు పార్టీలోని సీనియర్లు ముఖం చాటేశారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వారు విశాఖలో బాబు ఆరు గంటల పాటు నిరసనన సెగలతో చిక్కుకుపోతే కనీసం తొంగి చూడలేదు, వంగి వాలలేదు. మరి ఏంటీ పసుపు పార్టీ రాజకీయం అన్న చర్చ తమ్ముళ్ళలోనూ మొదలైంది.

 

బాబును వెన్నంటి ఉండే సీనియర్  నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఎయిర్ పోర్టుకు కనీసంగా కూడా  రాలేదు. వారు అక్కడ లేకపోవడం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. గంటా వైఖరి ఓ వైపు అనుమానంగా ఉంటే అయ్యన్న ఎందుకు రాలేదన్న చర్చ తమ్ముళ్ళలో కలవరం రేపేదే.

 

అయితే అయ్యన్నపాత్రుడు తన రెండవ కుమారుడు వివాహానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారని, అందుకే ఆయన రాలేదని అంటున్నారు. అలా  జరిగినా కూడా బాబు వంటి అధినాయకుడు గంటల తరబడి విమానాశ్రయంలో చిక్కుకుని ఉంటే కనీసం పరామర్శ చేయకపోవడమేంటన్న మాట వినిపిస్తోంది.

 

మరో వైపు చూసుకుంటే గంటా శ్రీనివాసరావు అయిపూ అజా లేకపోవడం కూడా తమ్ముళ్ళకు ఆందోళన కలిగిస్తోంది. పొరుగు జిల్లలా మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చిన రాజప్ప వంటి వారు బాబుకు చెరో వైపు బాసటగా ఉంటే జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు రాకపోవడం దారుణమేనని అంటున్నారు.

 

దీన్ని బట్టి చూస్తే విశాఖలో పార్టీ తీరు ఎలా ఉందో బాబుకే పూర్తిగా  అర్ధమవుతోందని అంటున్నారు. ఓ వైపు పాలనా రాజధానిని వ్యతిరేకిస్తూ బాబు తీసుకున్న నిర్ణయం పార్టీకి ఓ శాపంగా ఉంటే. ఇపుడు సీనియర్ల గైర్ హాజరు కావడం, పార్టీలో మిగిలిన నాయకుల్లో చురుకుదనం లేకపోవడం బట్టి చూస్తూంటే ఒకనాటి కంచుకోటలో టీడీపీ ఇపుడు పడుతున్న కష్టాలు పగ వారి పార్టీకి రాకూడదని అంటున్నారు.

 

టీడీపీకి  నాటి బలమంతా మంచులా కరిగిపోతోంది. దాంతో మరోవైపు వైసీపీ  బాబుని గట్టిగా నిలువరిస్తోంది. ఈ పరిణామాలను తట్టుకుని టీడీపీ ఉత్తరాంధ్రాలో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: