హైద‌రాబాద్‌లో మ‌రో బ‌డా కంపెనీ అడుగు పెట్టింది. అమెరికాకు చెందిన అతిపెద్ద హెల్త్‌కేర్‌ సేవల సంస్థ ప్రావిడెన్స్ ఆరోగ్యరంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటి. ఈ సంస్థకు అమెరికాలో 51 దవాఖానలు, వెయ్యి క్లినిక్‌లు ఉన్నాయి. 1.19 లక్షల మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ సాంకేతికత, వినూత్నతపై దృష్టి పెట్టేందుకు 2019లో ప్రావిడెన్స్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. 

 

తాజాగా ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఈ సెంట‌ర్‌ను ప్రారంభించారు. వినూత్న, సాంకేతికత అభివృద్ధికి అవకాశం కల్పించే నూతన సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయడం సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రావిడెన్స్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని ప్రావిడెన్స్‌ గ్లోబల్‌సెంటర్‌ మరింత పటిష్ఠంచేస్తుందని విశ్వా సం వ్యక్తం చేశారు.

 

ప్రావిడెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ బీజే మూరే మాట్లాడుతూ.. ‘మెరుగైన ప్రపంచంకోసం ఆరోగ్యం’ అనేది తమ సంస్థ ఆశయమని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సెంటర్‌ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. డిజిటల్‌ ఆధారిత ఆరోగ్య సంరక్షణ దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు అవసరమైన ఉన్నతస్థాయి ప్రతిభ భారత్‌లో ఉన్నదని చెప్పారు. వచ్చే నాలుగేళ్ల‌లో రూ.700కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు మూరే తెలిపారు. సమావేశం అనంతరం కంపెనీ కంట్రీ మేనేజర్‌ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో ప్రస్తుతం 350 మంది సిబ్బంది కూర్చోవడానికి వీలుంటుందని తెలిపారు. వచ్చే నాలుగేళ్ల‌లో ఈ సంఖ్యను 2వేలకు పెంచుకోబోతున్నట్టు ప్రకటించారు. కాగా, అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ ప్రావిడెన్స్‌.. ఈ సెంటర్‌ హెల్త్‌కేర్‌ డిజిటల్‌ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: