విశాఖపట్నం విమానాశ్రయంలో  చంద్రబాబునాయుడు గురువారం మధ్యాహ్నం పోలీసులపై  రెచ్చిపోయాడు. దాదాపు ఐదుగంటల పాటు జరిగిన హై డ్రామాలో పూనకం వచ్చినట్లుగా పోలీసులను చంద్రబాబు నోటికొచ్చినట్లు తిట్టేశాడు. ఒక దశలో పోలీసులను చంద్రబాబు కొట్టేస్తాడేమో అన్నంత ఆవేశంతో ఊగిపోయాడు. నిజానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇంతగా పోలీసులపై రెచ్చిపోవాల్సిన అవసరమైతే లేదు.

 

ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళు చెప్పినట్లు చేయటమే పోలీసుల పని అయిపోయింది. నిష్ఫక్షపాతంగానో లేకపోతే న్యాయం, ధర్మం ఆలోచించి సొంత బుర్రతో పనిచేసే స్వేచ్చా వాతావరణం అధికార యంత్రాంగానికి ముఖ్యంగా పోలీసులకు ఎప్పుడో పోయింది. ఇపుడు అదే విషయం మరోసారి నిర్ధారణయ్యింది. రెండు రోజుల చంద్రబాబు పర్యటన కోసమని టిడిపి నేతలు బుధవారం రాత్రే పోలీసుల నుండి అనుమతి తీసుకున్నారు. కానీ గురువారం ఉదయాని సీన్ మారిపోయింది.

 

విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు గురువారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న  వైసిపి కార్యకర్తలు, జనాలు ఎయిర్ పోర్టు దగ్గర చేరి గోల మొదలుపెట్టారు. దాని  పర్యవసానమే దాదాపు ఏడుగంటల ఉద్రిక్తత.  ఈ సందర్భంగానే పోలీసులపై చంద్రబాబు నోటికొచ్చినట్లు విరుచుకుపడ్డారు.

 

నిజానికి పోలీసులపై చంద్రబాబు నోరు చేసుకోవటం వల్ల ఎటువంటి లాభం ఉండదు. పబ్లిక్ ముందు లేకపోతే తన మీడియాలో ప్రచారానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే 2017లో జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు ఇదే విధంగా వ్యవహరించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రత్యేకహోదా విషయంలో క్యాండిల్ ర్యాలిలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన చంద్రబాబును అప్పటి పోలీసు అధికారులు విమానాశ్రయం బయటకు కూడా రానీయలేదు.

 

లాంజ్ లోనే జగన్ అదుపులోకి తీసుకున్న పోలీసులు అట్నుంచి అటే మళ్ళీ విమానంలోకి బలవంతంగా ఎక్కించి హైదరాబాద్ పంపేశారు. కాకపోతే అప్పట్లో జగన్ ఇపుడు చంద్రబాబు చేసినంత సీన్ చేయలేదంతే. ఇపుడు మాత్రం పోలీసులను పట్టుకుని తనను షూట్ చేయాలని, ఎన్ కౌంటర్ చేసేయమని, జుట్టు పట్టుకుని కొట్టమంటూ సంబంధం లేని మాటలు మాట్లాడి రెచ్చగొట్టటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: