తన చిన్న నాటి స్నేహితుడు ఇటీవల ఎన్నిక ప్రచారంలో తనను కలిసి బాగున్నావా అంటూ బాగోగులు అడిగాడు.. చిన్ననాటి ఫోటోలు చూసి తన బాల్య స్నేహితుల గురించి అడిగి తెలుసుకున్నాడు.  ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ప్రస్తుతం ఏపి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  ఇటీవల అనకాపల్లి పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన చిన్ననాటి స్నేహితులను స్కూల్ మెట్స్ ని కలిసి వచ్చారు. అలా కలిసి వచ్చిన వారిలో సీఎం జగన్ స్కూల్ మెట్ ఏడిద జగదీష్ ఉన్నారు.  కాగా, సీఎం జగన్‌పై అభిమానం చాటుకునే ప్రయత్నంలో ఆయన స్కూల్‌మేట్‌తోపాటు మరొకరు ప్రాణాలు వదిలారు. సీఎం జగన్‌తో కలిసి తాను దిగిన ఫొటోలను ఫ్లెక్సీగా రూపొందించిన ఆయన స్కూల్‌మేట్ దాన్ని డాబా మీది నుంచి కిందకు వేలాడదీసే క్రమంలో విద్యుత్ షాక్‌తో మరణించారు.

 

 వివరాల్లోకి వెళితే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి  అనకాపల్లి పట్టణంలోని శ్రీరామ్ నగర్‌కు చెందిన ఏడిద జగదీష్ చిన్నతనంలో  కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. జగదీష్ కి జగన్ అంటే ఎంతో అభిమానం. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత పాదయాత్ర చేపట్టినప్పుడు.. అనకాపల్లిలో ఆయన్ను జగదీష్ కలిశారు.  ఆ సమయంలో తన చిన్ననాటి ఫోటోలు, పాఠశాల స్నేహితులను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్నతనంలో కలిసి చదువుకున్నప్పటి ఫొటోలు, పాదయాత్రలో పాల్గన్నప్పుడు కలిసి దిగిన ఫొటోలతో జగదీష్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న జగదీష్ తన అభిమానాన్ని ఎంతో గొప్పగా చాటుకోబోతున్నానని భావించారు.

 

ఈ ఫ్లెక్సీని ఇంటి ముందు కట్టడం కోసం డాబా మీదకు ఎక్కారు. ఇందుకోసం   ముప్పిడి శ్రీను అనే వ్యక్తం సాయం కోరారు. ఇద్దరూ ఫ్లెక్సీ కడుతుండగా.. ఒక్కసారిగా గాలి వీయడంతో అది ఇంటి ముందున్న హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడింది. అంతే ఒక్కసారే షాక్ కొట్టడంతో ఎగిరి కింద పడిపోయారు.  ఇద్దర్నీ వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా జగదీష్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. దాంతో ఇరువురు కుటుంబాలతోపాటు అనకాపల్లి వైఎస్సార్సీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.  ఈ విషయం తెలిసి సీఎం జగన్ సైతం విషాదంలో మునిగిపోయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: