కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. ప్రపంచంలోని వైద్యులందరికీ సవాల్ విసురుతున్న రోగం. శాస్త్రవేత్తలను ఛాలెంజ్ చేస్తున్న మహమ్మారి. మొదట్లో ఇదేదో చైనాకు సంబంధించిన రోగం అనుకున్నారు. మనకేమీ కాదులే అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు కరోనా ఓ విశ్వరోగం అయ్యింది. ఎందుకంటే.. ప్రపంచంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

 

 

ఏకంగా ప్రపంచంలో 30పైగా దేశాలు ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ సమస్య ఒక్క చైనాది మాత్రమే కాదు. అనేక దేశాల్లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. చైనా, దక్షిణ కొరియా, గల్ఫ్ దేశాలు, జపాన్, ఇటలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచం కరోనాను ఎదుర్కొనేందుకు తగిన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి జపాన్‌ వ్యాప్తంగా పాఠశాలలను కొన్ని వారాల పాటు మూసివేయాలని ఆ దేశ ప్రధాని షింజో అబే అధికారులను ఆదేశించారు.

 

 

జపాన్ లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక,ఉన్నత పాఠశాలలను వచ్చే వారం మార్చి 2 నుంచి వైరస్ అదుపులోకి వచ్చేంత వరకూ తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పిల్లల ఆరోగ్యం భద్రతను అన్నింటికన్నా ఎక్కువగా పరిగణిస్తున్నామని అబే చెప్పారు . మరోవైపు జపాన్ తీరంలో నిలిపి వేసిన క్రూయిజ్ షిప్ డైమండ్ ప్రిన్సెస్‌లో వైరస్ బారిన పడిన ప్రయాణికుల సంఖ్య 700కు పెరిగింది. చైనా తరవాత ఎక్కువగా దక్షిణ కొరియాలో కరోనా ప్రభావం ఉంది.

 

 

ఇక ఇప్పుడు దక్షిణ కొరియా తరువాత యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇటలీలో ఈ వైరస్ జోరుగా వ్యాపిస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఈ దేశంలో కరోనా కేసులు 25 శాతం పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ఇటలీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 400కు పెరిగింది. ఇలా ఒక్కోదేశాన్ని కబలిస్తున్న కరోనా పేద దేశాల పాలిట మహమ్మరిగా మారే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: