ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రాంతానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొదట ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వే పూర్తయ్యాక ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సమీక్ష చేయనున్నారు. ఇరిగేషన్‌, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో భేటీ అయి పనులపై రివ్యూ చేయనున్నారు.

 

కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరానికి జగన్‌ వెళ్లడం ఇది రెండోసారి. సీఎం పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాంతంలో అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పోలవరం నిర్మాణంపై క్లారీటీ ఇచ్చారు. ఒక్క సంవత్సరంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతామని చెప్పారు. అదేవిధంగా గత ప్రభుత్వం టెండరింగ్‌లని క్యాన్సిల్ చేసి, ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ద్వారా ఏకంగా 830 కోట్ల రూపాయలు ఆదా చేసిన విషయం తెల్సిందే.

 

తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడుతూ...ప్రాజెక్టుని 2021 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే పోలవరంలో జరుగుతున్న పనులపై వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు స్పిల్‌ వేలో 43 బ్లాకుల్లో పియర్స్‌ పనులు ఊపందుకున్నాయని, ఒక్కో పియర్‌ను 55 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని, ఒక పియర్‌లో ఒక మీటర్‌ ఎత్తు పనులు చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుందన్నారు.

 

రోజుకు 1,500 క్యూబిక్‌ మీటర్ల చొప్పున స్పిల్‌ వేలో కాంక్రీట్‌ పనులు చేస్తున్నామని, జూన్‌ నాటికి స్పిల్‌ వేలో మొత్తం 2.05 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఇక జూలైలో ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించనున్నారు. ఇక జూన్‌లోగా 41.15 మీటర్ల పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేయనున్నారు.

 

ఇదిలా ఉంటే పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,400 కోట్లను రీయింబర్స్‌ చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ పంపిన ప్రతిపాదనలను కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఆమోదించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: