ఘోర రైలు ప్రమాదం తప్పింది. మంచిర్యాల జిల్లాలోని, రేచిని - ఆసిఫబాద్ రైల్వే స్టేషన్ ల మధ్య తాండూరు సమీపంలో, రైలు పట్టా విరగడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినది. విరిగిన రైలు పట్టాను గమనించిన వారు గ్యాంగ్‌ మెన్‌కు సమాచారం ఇవ్వడంతో, ప్రమాద స్థలానికి  చేరుకున్న రైల్వే బృందం సహాయక చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన రైల్వే టీం, గ్యాంగ్ మేన్స్ దీన్ని రిపేర్ చేయడంతో.. సమస్య సాల్వ్ అయింది.

 

రైలు పట్టాలు డామేజ్ అవడం ఇది ఫస్ట్ టైం కాదు. ఈ మధ్య కాలంలోనే ఇలాంటి సంఘటనలు పలు చూస్తూ వున్నాం. ఆమధ్య దిగా నుంచి విశాఖపట్నం వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ తిలారు రైల్వేస్టేషన్‌ సమీపంలోకి రాగానే పట్టాలు విరిగిన విషయాన్ని లోకోపైలట్‌ గుర్తించి రైలును చాకచక్యంగా నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. లేదంటే పెను ప్రమాదం సంభవించేది. ఇలాంటి సంఘటనలు ఎన్నో.. మరెన్నో..

 

సదరు రైల్వే అధికారి ఇలాంటి సంఘటనలు గుర్తిస్తే సరే సరి. లేదంటే చాలా తీవ్రమైన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పైలట్ ఏమాత్రం ఏమరుపాటు వహించినా... ఇక అంతే సంగతులు. లోకో పైలట్ తప్పిదాల వలన ఇటీవల జరిగిన ఘోరాలను కూడా మనం గమనించవచ్చు. ఆ మధ్య కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం... సిగ్నల్ ఇవ్వకుండానే లోకో పైలట్ ఎంఎంటీఎస్ రైలును ముందుకు నడిపించడం. దీనితో సదరు రైల్, వేరొక రైలుని ఢీకొంది.

 

దేశం మొత్తంలో అతి పెద్దదైన రైల్వే వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరగడం అత్యంత బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనల వల్లనైనా.. రైల్వే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని, మెరుగైన రైల్వే సేవలు అందిస్తే బావుంటుందని నిపుణుల సలహా. కేంద్రం దీనిపైన దృష్టి సారించి, పటిష్టమైన చర్యలు చేపడితే గాని, జరగబోయే ప్రమాదాలను అరికట్టలేమని.. పలువురు ప్రయాణీకులు ఈ సందర్భంగా, కేంద్రాన్ని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: