దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తుండటంతో కొత్తగా ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక కానున్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు... ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఆ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ బలం రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న రెండు నుంచి, ఆరుకు పెరుగుతుంది.



ఈ నాలుగు స్థానాల్లో రెండు స్థానాలకు అయోధ్య రామిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్లు దాదాపుగా ఖరారైనట్లే. అయోధ్య రామిరెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో తాను న‌ర‌సారావుపేట నుంచి పోటీ చేయ‌కుండా త‌ప్పుకున్నారు. దీంతో ఆయ‌న‌కు జ‌గ‌న్ ఇచ్చిన హామీ ప్ర‌కారం రాజ్య‌స‌భ ఖ‌రారైన‌ట్టే. ఇక మిగిలిన రెండింటికే బాగా పోటీ ఉంది. మండ‌లి ర‌ద్దు అవ్వ‌డంతో జ‌గ‌న్ మండ‌లి నుంచి మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ల‌కు సైతం రాజ్య‌స‌భ ప‌ద‌వులు ఇస్తాన‌ని హామీ ఇచ్చార‌ని వైసీపీ వ‌ర్గాల టాక్‌.



ఒక వేళ ఇప్ప‌టికిప్పుడు మండ‌లి ర‌ద్దు అయినా కూడా వారు ఏ ప‌ద‌వులు లేకుండా ఆరు నెల‌ల పాటు మంత్రులుగా కొన‌సాగ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప్ర‌మాణ స్వీకారం చేస్తే మ‌రో ఆరు నెల‌ల పాటు కూడా మంత్రులుగా ఉండ‌వ‌చ్చు. అయితే ఇప్పుడు ఈ ఇద్ద‌రికి రాజ్య‌స‌భ సీట్లు ఇవ్వ‌డం లేద‌ని టాక్‌. మండ‌లి ర‌ద్దు ఇప్ప‌ట్లో అయ్యేలా లేదు. ఒక‌వేళ రేపో మాపో అయినా వీళ్లు యేడాది పాటు మంత్రులుగా ఉండొచ్చు. ఇక వ‌చ్చే యేడాది జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌రో నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతాయి. అవి కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డ‌తాయి. అందుకే అప్ప‌టికి జ‌గ‌న్ వీరిని రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని భావిస్తున్నార‌ట‌. జ‌గ‌న్ డెసిష‌న్‌తో ఈ మంత్రులు ఇప్పుడు షాక్ అయినా వీరి పొలిటిక‌ల్ కెరీర్‌కు వ‌చ్చిన ఇబ్బందులు లేవు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: