కేంద్ర ప్రభుత్వం మరోసారి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోనుందా?  రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయబోతున్నారన్న వార్తలపై కేంద్రం స్పందనేంటి? అసలు గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నదేంటి? ఏటీఎంల్లో రెండు వేల నోట్లను నిలిపివేయడం, ఆర్బీఐ ప్రింటింగ్‌ మానేయడం వెనుకున్న మతలబు ఏంటి?  రెండు వేల రూపాయల నోటు చుట్టూ అసలు ఏం జరుగుతోంది?

 

రెండు వేల రూపాయల నోట్ల చెలామణి క్రమంగా తగ్గిపోతోంది. ప్రజల జేబుల్లో ఆ నోటు కనిపించి చాలా రోజులైంది. దీంతో త్వరలోనే రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయబోతున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ...ఇండియన్ బ్యాంక్ మార్చి 1 నుంచి ఏటీఎంల్లో 2వేల నోట్లు అందుబాటులో ఉండవని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 3 వేల 988 ఏటీఎంలల్లో మార్చి 1 నుంచి కేవలం 500, 200, 100 నోట్లు మాత్రమే లభిస్తాయి. అంతేకాదు... మిగతా బ్యాంకులు కూడా ఇదే బాటపట్టనున్నాయని, ఏటీఎంలలో 2,000 నోట్ల స్థానంలో 500 నోట్లను రీప్లేస్ చేస్తాయని వార్తలొస్తున్నాయి. రెండు వేల నోట్లకు చిల్లర మార్చుకునేందుకు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నందున...ఏటీఎంల్లో తక్కువ విలువ కలిగిన నోట్లను అందుబాటులోకి ఉంచుతున్నట్లు బ్యాంకులు తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటున్నాయి. 

 

మరోవైపు రెండు వేల రూపాయల నోట్ల ప్రింటింగ్‌ను ఆపివేసినట్లు రిజర్వ్‌ బ్యాంక్ తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు స్వయంగా ఆర్బీఐ నే 18 నెలలుగా వాటిని ప్రింట్ చేయడం లేదని ప్రకటించింది. దీనికి తోడు 2018-19 మధ్య కాలంలో చలామణీలో ఉన్న మొత్తం బ్యాంక్ నోట్లలో రెండు వేల రూపాయల  నోట్ల షేరు 3 శాతానికి తగ్గిపోయింది. దీంతో రెండు వేల నోటు రద్దుపై ప్రచారం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లింది.

 

ప్రజల్లో క్రమంగా ఆందోళన నెలకొనడంతో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.  రెండు వేల నోట్ల రూపాయల నోట్లను రద్దు చేసే యోచన తమకు లేదని, ఏటీఎంలలో పెద్ద నోట్లను నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎప్పటిలాగానే రెండు వేల రూపాయల నోట్లు చట్టబద్దంగా చలామణిలో ఉంటాయని, ఎలాంటి పుకార్లను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

 

కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత వచ్చినప్పటికీ...క్రమంగా రెండు వేల నోట్ల చెలామణి తగ్గుముఖం పడుతుండటంతో....ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదు. వరుస దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రం ఏ క్షణంలోనైనా హై డినామినేషన్ నోటును రద్దు చేయొచ్చని భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: