టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని కొత్త అవతారం ఎత్తాడు. క్రికెట్ మైదానంలో ఇన్నాళ్లు మెరుపులు మెరిపించిన ధోనీ.. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలోకి దిగాడు. బ్యాట్ పట్టిన చేత్తోనే విత్తనాలు నాటుతున్నాడు. వీడియోను స్వయంగా తనే షేర్ చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

గతేడాది మెగాటోర్నీ సెమీస్‌ తర్వాత మిస్టర్‌కూల్‌ ధోని క్రికెట్‌ నిరవధిక విరామం తీసుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టనున్నాడు మహీ. త్వరలోనే చెన్నై జట్టు ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్‌ మొదలుపెట్టనున్నాడు జార్ఖండ్‌ డైనమైట్‌. ఇప్పుడు తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు.

 

మైదానంలో మహీ కనిపించనప్పటికీ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాడు. ధోనీకి సంబంధించిన రెండు వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఒక వీడియోలో క్రికెట్‌ మైదానంలోని ప్రాక్టీస్‌ పిచ్‌ను రోలింగ్‌ చేసే వాహనాన్ని నడుపుతూ కనిపించాడు. జార్ఖండ్‌లోని రాంచీ స్టేడియంలో ధోని ఇలా సందడి చేశాడు. కొన్నాళ్లుగా జార్ఖండ్‌ ఆటగాళ్లతో ధోని ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.


 
మరోవైపు రైతుగా మారి...రాంచీలోని తన వ్యవసాయక్షేత్రంలో పుచ్చ కాయలు, బొప్పాయి పంటలని పండిస్తున్నాడు. ఈ పంటలను సేంద్రీయ పద్దతిలో పండిస్తున్నాడు మిస్టర్‌ కూల్‌. కొబ్బరికాయను కొట్టి పుచ్చకాయ విత్తనాలు నాటి సాగు ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. మంచి పని చేస్తున్నారని కొందరు కామెంట్ చేస్తే.. మీరు గ్రేట్ మహీ అంటూ ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. 

 

మొత్తానికి ధోనీ వ్యవసాయంపై తన మక్కువను నిరూపించుకుంటున్నాడు. క్రికెట్ మైదానంలో బ్యాట్ తో అద్భుతాలు సృష్టించడంలోనే కాదు.. వ్యవసాయం కూడా చేస్తానని నిరూపించుకుంటున్నాడు. 

 

దీంతో  ధోనీ అభిమానులకు.. ఆయనంటే మరింత ఇష్టం పెరుగుతోంది. వ్యవసాయం వదిలేసి పట్నం బాట పట్టి ఉద్యోగాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న ధోనీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: