రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు చేసేంత హడావిడి అధికారం కోల్పోయాక చేయరని విషయం ప్రస్తుతం టీడీపీ నేతలని చూస్తే అర్ధమైపోతుంది. 2014లో అధికారంలోకి వచ్చాక ఒక్కో టీడీపీ నాయకుడు ఏ విధంగా చేశారో అందరూ చూశారు. అయితే అధికారం కోల్పోయాక, పార్టీ కష్టాల్లో పడిపోతే చాలామంది అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఎలాగో ఓడిపోయిన నేతల్లో చాలామంది కంటికి కనపడటం లేదు. ఇక గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 

 

మిగిలిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఇటు పార్టీ కోసం, అటు నియోజకవర్గంలో కష్టపడేవారు చాలా తక్కువగా ఉన్నారు. అయితే అచ్చెన్నాయుడు ఎప్పుడు అధినేత చంద్రబాబుకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అటు గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇటు నియోజకవర్గంలోనే కష్టపడుతూనే, అటు అధినేతకు భుజం కాస్తున్నారు. ఇక ఇదే జిల్లాలో ఉన్న ఉండి ఎమ్మెల్యే కలవపూడి రాంబాబు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు.

 

తూర్పు గోదావరి విషయానికొస్తే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ...నియోజకవర్గంలో పనులు చేసుకుంటూనే, సోషల్ మీడియా, మీడియా ఇలా దొరికిన చోటల్లా వైసీపీ ప్రభుత్వాన్ని ఏకీపారేస్తున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా బాగానే కష్టపడుతున్నారు. ఆమె భర్త శ్రీనివాస్ పార్టీ కోసం బాగా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమం ఏదైనా వదిలిపెట్టకుండా చేస్తున్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎప్పుడు బాబుకు సపోర్ట్‌గా ఉంటున్నారు. తాజాగా కూడా విశాఖ పర్యటనలో చంద్రబాబు వెంటే ఉన్నారు. అటు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే...పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు.

 

ఇక గోదావరి ఎమ్మెల్యేలతో పాటు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు కూడా కష్టపడుతున్నారు. ఏదేమైనా గోదారోళ్ళు మాత్రం టీడీపీ కోసం గట్టిగానే నిలబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: